రవాణా శాఖ సేవల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.

Spread the love

రవాణా శాఖ సేవల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.

వాహన్, సారథి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్

ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు 24 గంటల సేవలు , ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్ ఏర్పాటు…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

వాహన్ (VAHAN), సారథి (SARATHI) పారివాహన్ పోర్టళ్ల ద్వారా రవాణా శాఖ సేవలు పొందుతున్న ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

పోర్టల్ లో వాహన యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, ఆధార్ వివరాల సరిపోలిక, హెచ్‌ఎస్‌ఆర్‌పీ వివరాల నమోదు, సర్వర్ నెమ్మదిగా పనిచేయడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC), కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజల ఫిర్యాదుల కోసం 24 గంటల కంట్రోల్ రూమ్

రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు ఫోన్ కాల్స్ లేదా వాట్సాప్ సందేశాల ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

కంట్రోల్ రూమ్ నంబర్: 9281607001

వాహన యాజమాన్య బదిలీ సమయంలో సంబంధిత RTA కార్యాలయాన్ని ఎంపిక చేయడంలో ఎదురైన సమస్య పరిష్కారమైందని, ఆధార్ వివరాలు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలతో సరిపోని వారు ఇతర అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

వాహన ఫిట్‌నెస్ ప్రక్రియలో హెచ్‌ఎస్‌ఆర్‌పీ వివరాలు VAHAN పోర్టల్‌లో కనిపించని పాత వాహనాల యజమానులు సంబంధిత RTO కార్యాలయాన్ని సంప్రదించి వివరాలను అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు. కొత్తగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్లు అమర్చాల్సిన వాహనదారులు సంబంధిత వాహన తయారీ సంస్థ అధీకృత డీలర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

ఇంటి నుంచే లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష

ప్రజలకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు సెప్టెంబర్ 27 నుంచి ఇంటి నుంచే లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రాసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ 8 నాటికి ఈ సదుపాయం ద్వారా 2,620 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని, 138 మంది ఉత్తీర్ణులు కాలేదని వెల్లడించారు.

రవాణా శాఖ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సాంకేతిక సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Loading