విజయవాడలో ఘనంగా గాంధీ శిల్ప్ బజార్ ప్రారంభం.. వివిధ రాష్ట్రాల కళాకృతులు ఒకే చోట

Spread the love

విజ‌య‌వాడ‌, అక్టోబ‌ర్ 09, 2026

కళలు, కళాకారులకు అండగా ప్రభుత్వం

  • చేనేత, హస్తకళలు, సంస్కృతిని కాపాడేందుకు విశేష కృషి
  • గాంధీ శిల్ప బ‌జార్ ప్రారంభోత్స‌వంలో ఏపీ హెచ్‌డీసీ ఛైర్మ‌న్ డా. ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్‌

కళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విశేష కృషిచేస్తున్నాయ‌ని ఏపీ హెచ్‌డీసీ ఛైర్మ‌న్ డా. ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ అన్నారు.
విజ‌య‌వాడ పటమట ఎన్‌టీఆర్ స‌ర్కిల్ స‌మీపంలోని మేరీస్‌ స్టెల్లా ఇండోర్‌ స్టేడియంలో హస్తకళా వస్తువులు, కళాత్మక వస్త్ర ప్రదర్శన, అమ్మకం వేదిక లేపాక్షి గాంధీ శిల్ప్ బజార్‌ను శుక్ర‌వారం ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ డా. పసుపులేటి హ‌రిప్ర‌సాద్, ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌) ఆర్‌.పి.సిసోడియా, స్థానిక శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ మోహ‌న్, ఏపీహెచ్‌డీసీ వీసీ అండ్ ఎండీ విశ్వ త‌దిత‌రుల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా హ‌రిప్ర‌సాద్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల హస్తకళాకారులు త‌యారుచేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి అమ్మకాలు నిర్వహించేలా గాంధీ శిల్ప్ బ‌జార్ అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా చేనేత‌, హ‌స్త‌క‌ళాకారుల ద్వారా స‌రికొత్త డిజైన్లు వ‌చ్చేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌జ‌లు చేనేత, హ‌స్త‌క‌ళాకారుల ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించాల‌ని.. చేనేత వ‌స్త్రాలు ఆరోగ్యానీకి మేలు చేస్తాయ‌ని పేర్కొన్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి, గౌర‌వ ఉప ముఖ్య‌మంత్రి సార‌థ్యంలో రాష్ట్రంలో చేనేత‌, హ‌స్త‌క‌ళాకారుల ఉత్ప‌త్తుల‌ను పెద్దఎత్తున ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంద‌ని.. గాంధీ శిల్ప్ బ‌జార్‌లో క‌ళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఎన్నో అద్భుత‌మైన ఉత్ప‌త్తులను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌ర ప్ర‌జ‌లు శిల్ప బ‌జార్‌ను సంద‌ర్శించి, క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించాల‌ని కోరారు. క‌ళ‌లు, క‌ళాకారుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపైనా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.
ఆర్‌.పి.సిసోడియా మాట్లాడుతూ గ్రామీణ కళాకారులు, చేనేత కార్మికులు, హస్తకళాకారులు తయారుచేసిన సంప్రదాయ కళాకృతులకు గాంధీ శిల్ప్ బజార్‌ మంచి వేదికగా నిలుస్తుందని, ఇటువంటి ప్రదర్శనల ద్వారా కళాకారులకు మార్కెటింగ్‌ అవకాశాలు పెరగడంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గ‌ద్దె రామ‌మోహ‌న్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రజల్లో ఆదరణ పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు దేశీయ కళలు, చేతివృత్తులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.
లేపాక్షి వీసీ, ఎండీ ఎం.విశ్వ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ క‌మిష‌న‌ర్ సహకారంతో నిర్వ‌హిస్తున్న గాంధీ శిల్ప బజార్‌లో మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, గద్వాల్, సిద్దిపేట్, నారాయణపేట్, చీరాల, కలంకారి, బాటిక్ ప్రింటింగ్, బెంగాలి కాటన్, కాశ్మీరి సిల్క్, కోసా సిల్క్, మధురై, లక్నో చికన్ వర్క్, నారాయణవరం, గాగ్రా చోళి, కాటన్ ప్రింటెడ్, సంబల్పూర్, కోసా (టస్సర్), ఆప్లిక్ వర్క్, ప్యాచ్ వర్క్, ఖాదీ మెటీరియల్, బెడ్ షీట్స్ వంటివి అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. హ‌స్తకళా వస్తువులను, చేనేతలను కొనుగోలు చేసి, కళాకారులకు చేయూతనివ్వాల‌ని పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ప్ర‌తిరోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు గాంధీ శిల్ప బ‌జార్ అందుబాటులో ఉంటుంద‌ని వెల్ల‌డించారు.
కార్య‌క్ర‌మంలో అడిషనల్ డైరెక్టర్ అపర్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Loading