ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శప్రాయం
డేటాలేక్ చాలా బాగుంది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయకుమార్ నారాయణ్ ప్రశంసలు

అమరావతి: రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ పనితీరు, ఈ సంస్థ చేపడుతున్న వివిధ సాంకేతిక కార్యకలాపాలు ఆదర్శప్రాయంగా, అనుసరణీయంగా ఉన్నాయని రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయకుమార్ నారాయణ్ అభినందించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ఆయనకు స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనితీరు, దాని లక్ష్యాల గురించి వివరించారు. ఆర్టీజీఎస్ చేపడుతున్న డేటాలేక్, అవేర్, ఆర్టీజీఎస్ సీసీటీవీ360, యూనిఫైడ్ గవర్నెన్స్ డ్యాష్ బోర్డు, మనమిత్ర తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు గురించి విపులీకరించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న డేటాను ఒక చోట అనుసంధానం చేసి ఈ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు ద్వారా విశ్లేషించి పాలనను మరింత సరళీకృతం చేయడానికి దోహదపడే పలు రకాల యూస్ కేసెస్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తద్వరా పౌరులకు ప్రభుత్వ సేవలు సంక్లిష్టంగా కాకుండా సరళంగా మారి, ఎలాంటి అంతరాయాలు లేకుండా పౌరులకు సేవలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. అవేర్ విభాగం ద్వారా నిరంతరం వాతావరణ పరిస్థితులను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామన్నారు. దీనిద్వారా ముందస్తుగానే వాతావరణ మార్పులను పసిగట్టి విపత్తుల నుంచి ప్రజలను, యంత్రాంగాన్ని ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. వరదలు, తుఫాన్ లాంటి విపత్తుల సమయంలో అవేర్ ద్వారా అత్యాధునిక సాంకేతిక విశ్లేషణల ద్వారా ప్రాణనష్టం, ఆస్తినష్టాల తీవ్రతను గణనీయంగా తగ్గించగలిగేలా ఆర్టీజీఎస్ సాంకేతిక తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో నీటి లభ్యత కూడా రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. సీసీఎల్ ఏ జాయింట్ సెక్రటరీ టీ.ఎస్. చేతన్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీసర్వే ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మృత్యుంజయకుమార్ నారాయణ్ మాట్లాడుతూ ఆర్టీజీఎస్ చేపడుతున్న కార్యకలాపాలను కొనియాడారు. ప్రధానంగా డేటాలేక్ ప్రాజెక్టును ఆయన ఆసక్తిగా తిలకించారు. డేటాలేక్ లాంటి ప్రాజెక్టు అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సెన్సెన్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె. నివాస్, ఆర్టీజీఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటు పి. శ్రీఖర్ తదితరులు పాల్గొన్నారు.
![]()
