దసరా ఉత్సవాల నేపథ్యంలో గన్నవరం డిపో నుంచి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి: విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ

Spread the love
  • దసరా ఉత్సవాల నేపథ్యంలో గన్నవరం డిపో నుంచి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి: విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ
  • గన్నవరం, ఉంగుటూరు, హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడపాలి
  • తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రతి అరగంటకు బస్సు సర్వీసు ఉండాలి
  • రాత్రి 11.30 గంటలకు విజయవాడ నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఏర్పాటు చేయాలి

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల నేపధ్యంలో గన్నవరం డిపో నుంచి మరిన్ని బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం డిపో మేనేజర్ ను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం డిపో మేనేజర్ తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన యార్లగడ్డ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ నగరంలో దసరా నవరాత్రి ఉత్సవాలు, సరస్ అజీవిక మేళా, విజయవాడ ఉత్సవ్ 2.0 లు ఒకేసారి మూడు ఉత్సవాలు జరుగుతున్నాయని వీటికి గన్నవరం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లే అవకాశం ఉన్నందున హనుమాన్ జంక్షన్, ఉంగుటూరు, గన్నవరం నుంచి మరిన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరారు. ఈ ఉత్సవాలు జరిగే పది రోజులు ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు జరిగే అవకాశం ఉన్నందున రాత్రి 11:30 కు విజయవాడ నుంచి గన్నవరం, ఉంగుటూరు, హనుమాన్ జంక్షన్ కు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. దసరా ఉత్సవాలకు భక్తులు వేకువజామున వెళ్లే అవకాశం ఉన్నందున ఉదయం 3 గంటల నుంచి ప్రతి అరగంటకు బస్సు చొప్పున షెడ్యూల్ ను ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ కు యార్లగడ్డ సూచించారు.

Loading