
జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని మరియు అనుమతుల నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
- బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించే అభ్యర్థులు సంబంధిత రిటర్నింగ్ అధికారి మరియు పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలి. అనుమతి పత్రంలో పేర్కొన్న స్థలం, సమయం, మార్గం మరియు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి.
- ప్రచారానికి వినియోగించే వాహనాల వివరాలను సబ్-కలెక్టర్ లేదా ఆర్డీవో కార్యాలయంలో సమర్పించి అనుమతి పొందాలి.
- అధికారులు జారీ చేసిన అసలు అనుమతి పత్రాన్ని వాహనం ముందు అద్దంపై స్పష్టంగా కనిపించేలా అతికించాలి.
- పోలింగ్ రోజున జడ్పీటీసీ అభ్యర్థికి గరిష్ఠంగా రెండు వాహనాలు, ఎంపీటీసీ అభ్యర్థికి ఒక వాహనం మాత్రమే ప్రత్యేక అనుమతితో అనుమతించబడుతుంది.
- ఓటర్లను తరలించడానికి వాహనాలను వినియోగించడం చట్టరీత్యా నేరం.
- రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతి ఉంటుంది.
- పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి లౌడ్ స్పీకర్ల వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుంది. వాహనాలపై మైకులు అమర్చేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి.
- ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు మరియు వాటి ప్రాంగణాల్లో ఎలాంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడరాతలు, కటౌట్లు ఏర్పాటు చేయరాదు.
- ప్రైవేట్ స్థలాలు లేదా భవనాలపై ప్రచార సామగ్రి ఏర్పాటు చేయడానికి సంబంధిత యజమానుల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. ఆ ఖర్చు వివరాలను 3 రోజుల్లోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించి ఎన్నికల వ్యయంలో చేర్చాలి.
- ఎన్నికల ప్రచార కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు మరియు చిరునామాలు తప్పనిసరిగా ముద్రించాలి. సంబంధిత డిక్లరేషన్ ఫారాలను (Annexure A & B) ముద్రణాలయానికి మరియు సంబంధిత అధికారులకు సమర్పించాలి.
- కులం, మతం, జాతి, భాష ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా లేదా వ్యక్తిగత దూషణలతో కూడిన అంశాలను ముద్రించకూడదు.
- నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
- ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం, బెదిరింపులకు పాల్పడటం నిషిద్ధం.
- ప్రభుత్వ వాహనాలు, సిబ్బంది, వనరులను ప్రచారానికి ఉపయోగించరాదు.
- పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ప్రచారాన్ని పూర్తిగా నిలిపివేయాలి; స్థానికేతరులైన రాజకీయ ప్రతినిధులు నియోజకవర్గాలను విడిచి వెళ్ళాలి.
- ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రిజిస్టర్, రసీదులు మరియు ఓచర్లను పక్కాగా నిర్వహించాలి.
- ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా ఎంపీడీవో ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల వ్యయ ఖాతాలను సమర్పించాలి. గడువులోగా సమర్పించని వారిపై చట్టప్రకారం అనర్హత వేటు పడే అవకాశం ఉంది.
- ఎన్నికల నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
![]()
