
భారీ వర్షంలోనూ పశ్చిమలో కొనసాగిన వైసిపి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా 32, 33వ డివిజన్లలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విస్తృత పర్యటన
త్యావసరాలు, ఇంధన ధరలు పెంచి సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజలను మోసం చేసిన కూటమి సర్కార్ – వెలంపల్లి
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్లే, 2024లో తప్పుడు వాగ్దానాలతో ప్రజలను నమ్మించి మోసం చేశారు – వెలంపల్లి
రాష్ట్రంలో రౌడీయిజం రాజ్యమేలుతోంది, ప్రతిపక్షాలను కనీసం నామినేషన్లు కూడా వేయనీవ్వడం లేదు – వెలంపల్లి
తుఫాన్ సాకుతో టికెట్లు ఎగ్గొట్టారు, పార్టీ నడపడం చేతకాకపోతే జనసేనను టీడీపీలో విలీనం చేయాలి – వెలంపల్లి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం ఉదయం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఆయన తన ప్రచారాన్ని విజయవంతంగా కొనసాగించారు. 32వ డివిజన్ పరిధిలోని కుమ్మరిపాలెం, హెడ్ వాటర్ వర్క్స్ ప్రాంతాల నుంచి ప్రచారం ప్రారంభించి తూనుగుంట్ల వారి వీధి, చెక్ పోస్ట్ వీధి, గుప్తా సెంటర్ షాదీ ఖానా, తాజ్ మస్జిద్ వీధి పరిసర ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం 33వ డివిజన్ కరకట్ట వద్ద గల రివర్ వ్యూ హోటల్ వీధి, బాల భాస్కర్ నగర్, అల్లుడు పేట, మసీద్ వీధి, ప్రెసిడెంట్ స్ట్రీట్ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, పెద్ద వర్షం పడుతున్నా వైఎస్సార్సీపీ క్యాడర్ చెక్కుచెదరలేదని, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. 2019కి ముందు ఈ ప్రాంతం ఎలా ఉండేదో, ఆ తర్వాత వైఎస్సార్సీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించాలని కోరారు. రానున్న రోజుల్లో కూడా తమ అభ్యర్థిను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ డివిజన్‌ను ఒక మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతామని ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. మేయర్ వైఎస్సార్సీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి గారిని, కార్పొరేటర్ అభ్యర్థులను ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కనీసం బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసరాలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడమే కాకుండా, గతంలో అమలు చేసిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా మహిళలు, యువత, వృద్ధులను నట్టేట ముంచారని మండిపడ్డారు. గతంలో ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారో, అదే రీతిలో 2024 ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు అమలు చేసిన ప్రజాకర్షక కార్యక్రమాలను సైతం నిలిపివేసి, పాలనను కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, రౌడీయిజం, గుండాయిజం, అరాచక పరిపాలన నడుస్తోందని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయడానికి వీల్లేని దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్మార్గమైన పాలనను చూడలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మార్పు రావాలన్నా, ఈ అరాచకానికి అడ్డుకట్ట పడాలన్నా వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించడమే మార్గమని పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపై స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ చేతగాని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తుఫాన్ కారణంగా జనసేనకు టిక్కెట్లు రాలేదని, అందుకే చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నామని పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తుఫానుకు, టిక్కెట్లకు సంబంధం ఏంటని ప్రశ్నించిన ఆయన, పార్టీని నడపడం, క్యాడర్‌ను చూసుకోవడం రాదని పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలని ఎద్దేవా చేశారు. 20 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకే మద్దతు పలకాలనుకుంటే, సొంతంగా పార్టీ ఎందుకు పెట్టారని, అనుభవం లేకపోతే పార్టీని మూసేసి తెలుగుదేశంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలన చేతకానప్పుడు, అనుభవం లేనప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు జనసేనకు లేదని, ప్రజలు అలాంటి పార్టీని నమ్మి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.
గతంలో వచ్చిన బుడమేరు వరద బాధితుల సమస్యపై స్పందిస్తూ, వరదల వల్ల ఇక్కడి డివిజన్లు పూర్తిగా మునిగిపోయి ప్రజలు అల్లాడిపోతే కూటమి ప్రభుత్వం నయాపైసా సాయం కూడా అందించలేదని దుయ్యబట్టారు. న్యాయం కోసం రోడ్డుపైకి వచ్చిన బాధితులపై పోలీసులతో లాఠీఛార్జ్ చేయించారని గుర్తుచేశారు. ఈ ప్రాంతం మునకకు గురికాలేదంటూ అబద్ధాలు ఆడి ప్రజలను మోసగించిన చంద్రబాబు, కూటమి నేతలు ఓట్ల కోసం వస్తే స్థానిక ప్రజలు నిలదీయాలని కోరారు. వరద సాయం ఎందుకు ఇవ్వలేదో గల్లా పట్టి అడగాలని, ఈ ఎన్నికల్లో కూటమి నేతలకు గుణపాఠం చెబుతూ ప్రజలంతా ఏకపక్షంగా ‘ఫ్యాన్’ గుర్తుకే ఓట్లు గుద్ది వైఎస్సార్సీపీకి ఘన విజయం చేకూరుస్తారని ఆయన స్పష్టం చేశారు.
![]()
