
ఆర్నబ్ తుఫాన్‌పై అధికారులతో ఎమ్మెల్యే యార్లగడ్డ సమీక్ష
గన్నవరం : ఆర్నబ్ తుఫాను ప్రభావం పై ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు బుధవారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులతో జరిపిన ఈ సమావేశంలో తుఫాన్ నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో తుఫాను ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ పంటలకు మాత్రం నష్టం వాటిల్లినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గురువారం కూడా వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరద ముంపు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మురుగు కాలువల్లో అడ్డంకులు తొలగించి వర్షం నీరు సక్రమంగా బయటికి పోయేలా చూడాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. పంట నష్టం వివరాలను నమోదు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా కు అంతరాయం లేకుండా యుద్ధప్రతిపదికన మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవటంతోపాటు సురక్షిత త్రాగునీటి పథకాలను క్లోరినేషన్ చేసి, తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. నియోజకవర్గం లో వరద ముంపు లేనప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచడంతో పాటు అవసరమైన చోట్ల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు యార్లగడ్డ సూచించారు. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినందున, ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నాలుగు మండలాలోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని కంట్రోల్ రూమ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యార్లగడ్డ కోరారు.
![]()
