
విజయవాడ వన్ టౌన్ పరిధిలోని కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంగణంలోని వస్త్రాలత హోల్ సేల్ క్లాత్ మార్కెట్ నందు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం విస్తృతంగా పర్యటించారు. విజయవాడ నగర వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మండెపూడి ఛటర్జీ లతో కలిసి ఆయన మార్కెట్లోని పలు దుకాణాలను సందర్శించారు. స్థానిక వ్యాపారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను, క్షేత్రస్థాయి అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నగర ప్రగతిని కాంక్షిస్తూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించాలని వ్యాపారులను కోరారు. విజయవాడ నగర మేయర్ వైఎస్సార్సీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిని, కార్పొరేటర్ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలోకి తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిందని, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, బీహార్‌ను మించిన స్థాయిలో రాక్షస పాలన, రౌడీయిజం రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు.
పన్నుల వసూళ్ల పేరుతో అధికారులు వ్యాపారస్తులపై లక్ష్యాలు నిర్దేశించుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం లేకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యాపారులకు ఎన్నడూ ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదని గుర్తుచేశారు. ప్రజలు, వ్యాపారుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన చారిత్రక బాధ్యత అందరిపై ఉందని వెలంపల్లి పిలుపునిచ్చారు
![]()
