
కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో అభివృద్ధి పరుగులు
- 2024 సాధారణ ఎన్నికల స్ఫూర్తిని మరోసారి చాటాలి
- సీట్ల సర్దుబాటులో సవాళ్లు ఎదురయ్యాయి
- వాటిని అధిగమించి ఐక్యంగా ముందుకు వెళ్దాం
- బీఫాంలు అందుకున్న అభ్యర్థులకి మిగిలిన వారంతా సహకరించాలి
- త్యాగం చేసిన వారికి భవిష్యత్తులో తగిన అవకాశాలు
- సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కూటమి అగ్రనాయకుల మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
‘2024 సాధారణ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చాలా సులభంగా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే సరికి దానికి మించిన సవాళ్లు ఎదురయ్యాయి. మూడు పార్టీల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటం, క్షేత్రస్థాయి పరిస్థితులు, దానికి మించి అంచనాలు అధికం కావడంతో పార్టీ అభ్యర్థిత్వాల కోసం పోటీ తీవ్రం అయింది. వీటన్నింటినీ అధిగమించి మూడు పార్టీల నాయకత్వం కూర్చొని బీఫాంల పంపిణీ చేపట్టామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బీఫాంలు ఇచ్చిన వారికి అందరూ సహకరించాలనీ, మిగిలిన వారికి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కోపతాపాలకు పోయి కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించవద్దని కోరారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తో కలిసి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం కొలువు తీరే నాటికి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు పాలనా అనుభవం, చాకచక్యతతో రాష్ట్రాన్ని ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాం. ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. రాష్ట్ర పునర్నిర్మాణంలో అడుగులు వేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని ఇటీవల కలిసినప్పుడు కూడా దేశానికి వస్తున్న 100 శాతం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25 శాతం తీసుకెళ్తోందని చెప్పడం ఆనందం కలిగించింది. పెట్టుబడులకు సానుకూలమైన పరిస్థితి కల్పించిన పాలనను అభినందించారు.
అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం
సాధారణ ఎన్నికల స్థాయిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమైనవి. స్థానిక నాయకత్వం పెంపొందించుకునే అవకాశం ఉన్నవి. సాధారణ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చాలా తేలికగా జరిగింది. ఇప్పుడు చాలా అంశాలను పరిశీలించి
తగిన నిర్ణయం తీసుకోవల్సి వస్తోంది. మూడు పార్టీల స్థానిక నాయకత్వాలు కూర్చొని సర్దుబాటు చేసుకోవల్సిన విషయాలు కూడా అధినాయకత్వం వరకు వచ్చిన సందర్భాలున్నాయి. ఇది మూడు పార్టీల నాయకత్వానికి ఛాలెంజింగ్ అనిపించింది. వాటిని అన్ని రకాలుగా పరిశీలించి, సానుకూలంగా చర్చించి ఇప్పుడు ఏకాభిప్రాయంతో ఎన్నికలకు వెళ్తున్నాం. మేం చూపించిన చొరవ, స్ఫూర్తిని కిందిస్థాయిలో మూడు పార్టీల కూటమి నాయకత్వం, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
పల్లెలకు అభివృద్ధి కళను తీసుకొచ్చాం
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రూ.20,390 వేల కోట్లతో 16 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 19,500 కిలోమీటర్ల బీటీ రోడ్లతో పాటు, మినీ గోకులాలు, నీటి గుంటలు, పశువుల నీటి తొట్టెలు వంటి పనులు చేయగలిగాం. అడవి తల్లి బాట రెండు దశల్లో రూ.3,458 కోట్లతో 3,630 కిలోమీటర్ల రోడ్లు, 45 వంతెనలు, 2,199 గిరిజన అవాసాలకు 1,300 రహదారులను పూర్తి చేశాం పర్యావరణ ప్రేమికులుగా ముఖ్యమంత్రి ఆకాంక్షతో 2047 నాటికి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో రాష్ట్రాన్ని 50 శాతం గ్రీన్ కవర్ చేసేలా పనిచేస్తున్నాం. అమరజీవి జలధార పనుల కింద రూ. 30,156 కోట్లతో 50,300 పనుల్ని చేపట్టాం. పథకాన్ని కేంద్రం 2028 సంవత్సరం వరకు పొడిగించింది. ఇప్పటి వరకు జల్ జీవన్ మిషన్ పథకంలో 27.36 లక్షల కొత్త ఆవాసాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం. మొత్తంగా రాష్ట్రంలో 3.27 కోట్ల గ్రామీణ ప్రజల తాగునీటి వెతలు తీర్చేలా చేయగలిగాం. ప్రభుత్వం వచ్చాక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో రూ. 1.50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు పెండింగ్ లో పెట్టిన రూ.30 వేల కోట్ల నిధులను చెల్లించాం. పేదలకు 60 వేల సొంతింటి ఇంటి పట్టాలను ఇచ్చాం. రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు వచ్చాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, ఏఐ డేటా సెంటర్లను తీసుకురాగలిగాం. పోలవరం, హంద్రీనీవా, భోగాపురం విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లగలిగాం. ఈగల్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, వాట్సప్ గవర్నెన్స్ 1035 ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందిస్తున్నాం. ఇలా అన్ని పాలన విషయాలు, అభివృద్ధి అంశాలు, సంక్షేమ పురోగతిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం.
సవాళ్లను సమష్టిగా ఎదుర్కోండి
స్థానిక సంస్థల పాలనలో కూటమి అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని సమష్టిగా ఎదుర్కోవాలి. ప్రభుత్వానికి తగు విధంగా సహకరించి, స్థానిక సంస్థలను ప్రగతి పథంలో నడిపించాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలంటే అంతా ఐక్యంగా పనిచేయాలి. 2024 సాధారణ ఎన్నికల్లో 93 శాతం అసెంబ్లీ స్థానాలు ఐక్యంగా ముందుకు వెళ్లి గెలుచుకున్నాం. అలాంటి గెలుపే మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపాలని అన్ని పార్టీల నాయకుల్ని కోరుతున్నాను. చాలాచోట్ల ఔత్సాహికులంతా నామినేషన్లు వేశారు. పార్టీ తరఫునల బీఫాంలు అందిన వారు మాత్రమే బరిలో నిలవండి. మిగిలిన వారికి భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం. అంతేగాని కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకండి. ఈ ఎన్నికల్లో సూక్ష్మస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అర్నబ్ తుపాను రూపంలో విపత్తు రావడం, దాని మీద పెట్టాల్సిన అవసరం వచ్చింది. కూటమి నాయకులంతా అర్నబ్ సహాయచర్యల్లో పాల్గొనండి. దేవుడి దయతో తుపాను వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం కలగకూడదని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేయానికి కూటమి ఎల్లపుడూ కృషి చేస్తుంది. ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలి” అన్నారు.
బలబలాలనే బట్టే నిర్ణయం తీసుకున్నాం
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘‘రాజకీయ పార్టీకి అధికారం… సంస్థాగత బలం అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. దానికి సమయం కావాలి. ఓ పార్టీ నిర్మాణాత్మకంగా, సంస్థాగతంగా, రాజకీయంగా బలంగా ఎదగాలంటే కనీసం 25 సంవత్సరాల సమయం పడుతుందని నేను పార్టీ పెట్టినప్పుడే చెప్పాను. తెలుగుదేశం పార్టీకి నాలుగున్నర దశాబ్దాల సంస్థాగత, క్షేత్రస్థాయి బలం ఉంది.. దాన్ని పోటీకి తగ్గించాలని చెప్పలేం. అలాగే జనసేన పార్టీ బలం, పోరాటం కూడా బలంగా ఉంది.. అయితే అది భారీ స్థాయిలో ముందుకు వెళ్లడానికి సమయం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజా రెఫరెండెంగా భావించడం లేదు. రెండున్నర ఏళ్ల పాలన తాలుకా రిఫరెన్సుగా మాత్రమే భావిస్తున్నాం. ఈ ఎన్నికల్లో 2024 కంటే ప్రతిపక్ష పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చాయంటే మాత్రం ప్రజలు ఆ పార్టీని బలంగా తిరస్కరిస్తున్నట్లే భావించాలి. జనసేన పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు స్వతంత్ర ఆలోచనలు ఉండటం సహజం. మూడు పార్టీల్లోనూ గత సాధారణ ఎన్నికల్లో కష్టపడిన వారు, గట్టిగా పనిచేసిన వారు స్థానిక ఎన్నికల్లో ఆశావహులుగా ఉన్నారు. వారిలో చాలా మంది నామినేషన్లు వేశారు. అయితే వారికి అవకాశం రాకపోతే మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి. రాజకీయ పరంగా కాకుండా, ప్రజా కోణంలో ఎన్నికలను చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడూ ఇంతటి కసరత్తు జరగలేదు. మూడు పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని సర్దుబాటు చేయగలిగాం. నేను కూడా మా నాయకులు చెప్పారు కదా అని నేల విడిచి సాము చేయలేదు. అలాగే టీడీపీ, బీజేపీ పార్టీలు సైతం కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడిని తీసుకొని ఐక్యంగా ముందుకు కదిలాయి. కూటమి స్ఫూర్తి దెబ్బతినకుండా చూడగలిగాం. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే పార్టీల పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. తుదకు అంతా ఉమ్మడిగా ఎన్నికల్లో పనిచేయాలి.
ప్రజలకు రక్షణగా వైసీపీకి 10 x చూపిస్తాం
వైసీపీ నాయకులు రెచ్చిపోయి 2.0 చూపిస్తాం అని మాట్లాడితే, మేం ప్రజలకు రక్షణగా, రాష్ట్రాన్ని కాపాడుకునేలా 10 x చూపిస్తాం. గతంలో వారు 1.0 చూపించినప్పుడే బలంగా తట్టుకొని నిలబడిన వాళ్లం. వారి అఘాయిత్యాలు, అరాచకాలు చూసిన వాళ్లమే. వాళ్లకు వారి బలహీనత తెలుసు కాబట్టే బెదిరింపులకు దిగుతున్నారు. బలవంతుడెపుడు బెదిరించడు. చేయాల్సింది చేస్తాడు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఆ పార్టీ నాయకుల ప్రవర్తనను చూస్తున్నారు. ప్రజలే సరైన సమయంలో సరైన తీర్పు చెబుతారు” అన్నారు.
![]()
