విజయవాడ, అక్టోబర్ 08, 2026
ఒత్తిడిని జయిస్తే.. ఆరోగ్యం, పనితీరు మెరుగే!

- మానసిక ఒత్తిడిని తొలిదశలోనే గుర్తించి అధిగమించాలి: డా. జి.సమరం
- జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పర్యవేక్షణలో విజయవంతంగా మానసిక ఆరోగ్య కార్యక్రమాలు
మానసిక ఒత్తిడిని తొలిదశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం, పనితీరు మెరుగుపడతాయని ప్రముఖ వైద్యుడు డాక్టర్ జి.సమరం తెలిపారు. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవచ్చన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యోగుల కోసం ఆకర్ష ఫౌండేషన్, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సైకాలజిస్ట్ డా. టి.ఎస్.రావు అధ్యక్షత వహించారు. ఉద్యోగులు ఒత్తిడిని నిర్వహించుకునే విధానంపై డా. జి.సమరం విలువైన సూచనలు చేశారు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల నిద్ర, ఆకలి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజూ నడక, తగినంత నిద్ర, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న మానసిక ఆరోగ్య కార్యక్రమాల్లో ఇది 20వ కార్యక్రమమని తెలిపారు. ఉద్యోగులు మానసికంగా ఉత్సాహంగా, ఆరోగ్యంగా పనిచేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైకాలజిస్టులు కవిత, జగదీష్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై సూచనలు అందించారు. ప్రత్యేక కౌన్సెలింగ్ లో పలువురు ఉద్యోగులు నిపుణులతో తమ వ్యక్తిగత సమస్యలను చర్చించి సలహాలు పొందారు. కార్యక్రమంలో ఆకర్ష ఫౌండేషన్ చైర్మన్ డా. శంకరరావు, కలెక్టరేట్ నోడల్ అధికారి జి.జ్యోతి, సైకాలజిస్టులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
![]()
