సరస్ మేళాకు సమగ్ర ఏర్పాట్లు..

- దేశం నలుమూలల నుంచి నుంచి 600 స్టాళ్ల వరకు ఏర్పాటు
- నాణ్యవంతమైన హస్తకళా, చేనేత ఉత్పత్తుల ప్రదర్శన
- స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఈ నెల 13వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతీయస్థాయి సరస్ అజీవిక మేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
గురువారం సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్ఆర్ఎల్ఎం డైరెక్టర్ డా. మోలిశ్రీ, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులు సరస్ మేళాకు పున్నమి ఘాట్ వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడారు. దేశం నలుమూలల నుంచి 600 వరకు స్టాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని.. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. హస్తకళా ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులను, కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయ కళలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగర ప్రజలతో పాటు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, సందర్శకులు సరస్ మేళాను పెద్ద సంఖ్యలో సందర్శించి, వివిధ రాష్ట్రాల మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. గౌరవ రాష్ట్రపతితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్, సరస్ మేళా.. ఇలా మూడు కార్యక్రమాలు ఒకేసారి జరగనుండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమష్టిగా కార్యక్రమాల విజయవంతానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు.
![]()
