మత్తుకు వ్యతిరేకంగా… మహిళల భద్రత కోసం… రోడ్డు ప్రమాదాల నివారణకు… మైలవరంలో “ఆపరేషన్ త్రిశూల్ వ్యూహం” కాగడాల ర్యాలీ

Spread the love

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
ది.08.10.2026

మత్తుకు వ్యతిరేకంగా… మహిళల భద్రత కోసం… రోడ్డు ప్రమాదాల నివారణకు… మైలవరంలో “ఆపరేషన్ త్రిశూల్ వ్యూహం” కాగడాల ర్యాలీ

విద్యార్థినీ విద్యార్థులతో మానవహారం — “డ్రగ్స్ వద్దు — జీవితం ముద్దు”, “వేగం వద్దు — క్షేమం ముద్దు”, “మహిళలను గౌరవిద్దాం — భద్రతకు అండగా నిలుద్దాం” అనే నినాదాలతో మార్మోగిన పట్టణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐపీఎస్ సూచనలతో మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ అనే మూడు ప్రధాన లక్ష్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “ఆపరేషన్ త్రిశూల్ వ్యూహం” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
లో భాగంగా ఈరోజు సాయంత్రం కాగడాల ర్యాలీ నిర్వహించారు.

ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం మైలవరం పట్టణంలో రూరల్ డీసీపీ లక్ష్మీ నారాయణ ఐపీఎస్ ఆధ్వర్యంలో, మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు అధ్యక్షతన మైలవరం చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్ క్లబ్ సహకారంతో, ఎల్‌బీఆర్‌సీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థినీ విద్యార్థులతో కాగడాల ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు.

మైలవరం పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ప్రారంభమైన కాగడాల ర్యాలీ పంచాయతీ సెంటర్ వరకు కొనసాగింది. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, మహిళల భద్రతకు మద్దతుగా, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ పాల్గొన్నవారు నినాదాలు చేశారు. “డ్రగ్స్ వద్దు — జీవితం ముద్దు”, “వేగం వద్దు — క్షేమం ముద్దు”, “మహిళలను గౌరవిద్దాం — భద్రతకు అండగా నిలుద్దాం” అనే నినాదాలతో పట్టణం మార్మోగింది.
అనంతరం పంచాయతీ సెంటర్ వద్ద విద్యార్థినీ విద్యార్థులు అందరూ మానవహారంగా ఏర్పడి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని మూడు అంశాలపై సామాజిక బాధ్యతను చాటిచెప్పారు.

మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దెబ్బతీయడంతోపాటు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. యువత విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు వైపు ముందుకు సాగాలని సందేశాన్ని అందించారు.

మహిళలు, బాలికలు భయం లేకుండా జీవించే సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వేధింపులను ఉపేక్షించకుండా బాధితులకు అండగా నిలవాలని అవగాహన కల్పించారు. అలాగే అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం, హెల్మెట్‌, సీటుబెల్ట్‌ ధరించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు.

ఈ కార్యక్రమంలో మైలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. కిషోర్ బాబు కొత్తూరి, మైలవరం ఎస్‌ఐ సుధాకర్, జి. కొండూరు ఎస్‌ఐ సతీష్, రెడ్డిగూడెం ఎస్‌ఐ శ్రీను, మహిళా ఎస్‌ఐ గిరిజా, మైలవరం ఎస్‌ఐలు గిరి, సాయి, పోలీసు సిబ్బంది, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ఎల్‌బీఆర్‌సీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తు రహిత సమాజం — మహిళలకు భద్రత — ప్రమాద రహిత ప్రయాణం లక్ష్యంగా ప్రజలందరూ పోలీసులతో కలిసి ముందుకు రావాలనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

Loading