ఎన్‌టీఆర్ జిల్లా, ఆగస్టు 01, 2025
విప్లవాత్మకంగా ఆటో మ్యుటేషన్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం
- ఆటో మ్యుటేషన్‌తో రిజిస్ట్రేషన్ సేవలు మరింత పారదర్శకం
- ఒకేరోజు ఒకేచోట తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్‌తో పాటే తక్షణ మ్యుటేషన్
- ఈజ్ ఆఫ్ డూయింగ్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ సర్వీసులు
- ప్రజలందరూ అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆటో మ్యుటేషన్ ప్రక్రియకు శ్రీకారంచుట్టడం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు మరింత పారదర్శకమయ్యాయని.. ఇదో విప్లవాత్మకమైన మార్పు అని, కొత్త విధానంలో ఒకేరోజు ఒకే చోట చాలా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్‌తో పాటే తక్షణ మ్యుటేషన్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
రాష్ట్రంలోని 17 మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శుక్రవారం ఆటో మ్యుటేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి నగరంలోని గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ అవుతున్న ప్రక్రియను పరిశీలించారు. నగరంలోని చిట్టినగర్‌కు చెందిన నంబూరు సామ్రాజ్యలక్ష్మి కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ ఆస్తి రిజిస్ట్రేషన్, ఆటో మ్యుటేషన్ ప్రక్రియను స్టెప్ 1 మొదలు స్టెప్ 7 వరకు చివరగా మ్యుటేషన్ సర్టిఫికేట్ జనరేట్ అయినంత వరకు ప్రక్రియను పరిశీలించారు. ఇదంతా అరగంటలోనే పూర్తికావడంతో ఇరు పార్టీలు ప్రభుత్వ సేవల్లో వేగంపై ఆనందం వ్యక్తం చేశాయి. కలెక్టర్ లక్ష్మీశ, కమిషనర్ ధ్యానచంద్రలు లబ్ధిదారుకు మ్యుటేషన్ సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ ఆస్తి రిజిస్ట్రేషన్ తర్వాత మునిసిపల్ రికార్డుల్లో యజమాని పేరు మారాలంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లతో మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవడం, అక్కడ ఆ ప్రక్రియ పూర్తికి కూడా కొంత సమయం పట్టడం జరుగుతుండేదని.. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ఆటో మ్యుటేషన్ వల్ల ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ కూడా పూర్తవుతుందని.. మునిసిపల్ డేటా బేస్‌లో ఆటోమేటిక్‌గా యజమాని పేరు మారిపోతుందని వివరించారు. ఆటో మ్యుటేషన్ వల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే మ్యుటేషన్ జరిగిపోతుందన్నారు. డాక్యుమెంటేషన్ వర్క్ తగ్గడమే కాకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందుతాయన్నారు. రిజిస్ట్రేషన్, మునిసిపల్ డిపార్టుమెంట్ల డేటాబేస్ అనుసంధానంతో సరళీకృత సేవలు లభిస్తాయన్నారు. సేవలపై ప్రజలకు విశ్వాసాన్ని, సంతృప్తి స్థాయిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఆటోమ్యూటేషన్ మంచి ఉదాహరణ అని.. ఈ విధానాన్ని అందుబాటులో ఉంచిన గౌరవ ముఖ్యమంత్రికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
పట్టణ డిజిటల్ పాలనలో కీలక మైలురాయి: కమిషనర్ ధ్యానచంద్ర
ఆటో మ్యుటేషన్ అనేది పట్టణ డిజిటల్ పాలనలో కీలక మైలురాయి అని.. మ్యుటేషన్ కోసం మునిసిపల్ కార్యాలయానికిగానీ వార్డు సచివాలయానికిగానీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రార్ కార్యాలయంలోనే మ్యుటేషన్ పూర్తవుతుందని మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. దీనివల్ల రిజిస్ట్రార్ కార్యాలయంలోనే మునిసిపల్ డేటా బేస్‌లో పేరు నమోదవుతుందని పేర్కొన్నారు. విజయవాడ అర్బన్ పరిధిలోని నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. 64 డివిజన్ల ప్రజలు అవగాహన పెంచుకొని, సద్వినియోగం చేసుకోవాలని ధ్యానచంద్ర కోరారు.
కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎ.రవీంద్రనాథ్, జిల్లా రిజిస్ట్రార్ పీవీవీ దుర్గాప్రసాద్, సబ్ రిజిస్ట్రార్లు ఎండీ ఆరిఫ్, కె.వెంకటేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.