కొత్త బార్ పాలసీపై మంత్రుల బృందం కీలక భేటీ

0

కొత్త బార్ పాలసీపై మంత్రుల బృందం కీలక భేటీ

ఆగస్టు 31తో ముగియనున్న ప్రస్తుత పాలసీ గడువు

అమరావతి, ఆగస్టు 1:
ప్రస్తుత బార్ పాలసీ గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో, నూతన ఎక్సైజ్ విధానంపై మంత్రుల బృందం శుక్రవారం ఒక కీలక సమావేశం నిర్వహించింది. మంగళగిరి ఎక్సైజ్ కమీషనర్ కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడ్‌లో జరిగిన ఈ సమావేశంలో రాబోయే కొత్త బార్ పాలసీ రూపకల్పన పై లోతైన చర్చ జరిగింది. సమావేశానికి ఎక్సైజ్, ఖనిజ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇంధన శాఖ మంత్రి గోట్టి‌పాటి రవికుమార్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ ప్రస్తుతం అమలులో ఉన్న 2022–25 బార్ పాలసీపై సమగ్రంగా వివరించారు. ప్రస్తుత పాలసీ క్రింద రాష్ట్రంలో 840 స్టాండలోన్ బార్లు, 50 స్టార్ హోటల్స్, మైక్రోబ్రూరీస్ లాంటి సంస్థలకు లైసెన్సులు మంజూరయ్యాయని చెప్పారు. అలాగే 44 బార్ లైసెన్సులు గడువు ముగిసిన తర్వాత రిన్యువల్ కాలేదని తెలియజేశారు. పక్కటి రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మరియు కేరళల బార్ విధానాలపై పోలికలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.

సాధారణ పరిపాలన (రాజకీయం), ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా వివిధ సంఘాల నుంచి వచ్చిన అభిప్రాయాలను మంత్రులకు వివరించారు. రాష్ట్ర వైన్ డీలర్లు, స్టార్ హోటల్‌ల అసోసియేషన్‌లు, హోటల్ యజమానుల సమాఖ్యల నుండి వచ్చిన వినతులను సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. గతంలో పాటించిన బార్ లైసెన్సింగ్ విధానాలు, వాటి ప్రభావం, కొత్త విధానాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయన్నదాని గురించి వివరించారు. మంత్రులు తమ సూచనలు, ఆలోచనలు ప్రస్తావించారు. ప్రస్తుత షాపు పాలసీ అమలుపై సమాచారం కోరడంతో పాటు, టూరిజం శాఖతో సమన్వయం కల్పించి, పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా పాలసీ రూపొందించాలని సూచనలు వచ్చాయి. కొత్త పారిశ్రామిక కారిడార్లలో బార్లకు చేయాల్సిన మార్పులు కూడా చర్చకు వచ్చాయి. యువ పారిశ్రామికవేత్తలు కొత్తగా రంగంలోకి రావడాన్ని ప్రోత్సహించే విధానాలు తీసుకురావాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ సూచనల ఆధారంగా బార్ పాలసీకి తుది రూపం ఇవ్వడానికి ఎక్సైజ్ శాఖ మరింతగా ఆలోచించి, పాలసీ రూపకల్పనను ముందుకు తీసుకెళ్తుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తదుపరి సమావేశంలో నూతన విధానాన్ని సమీక్షించి, తుది నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. ఈ సమావేశానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, అదనపు కమిషనర్ దేవకుమార్, జాయింట్ కమిషనర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version