విజయవాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని జాతీయ ర‌హ‌దారుల‌ సమస్యల పరిష్కారానికి కేశినేని శివనాథ్ కృషి

0

30-07-2025

విజయవాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని జాతీయ ర‌హ‌దారుల‌ సమస్యల పరిష్కారానికి కేశినేని శివనాథ్ కృషి

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కీల‌క భేటీ

విజయవాడ అభివృద్ధి కొరకు నాలుగు కీలక అభ్యర్థనలు

జాతీయ రహదారుల విస్తరణ, సబ్‌వేస్‌లు, సర్వీస్ రోడ్లపై ప్రత్యేక దృష్టి

విజయవాడ – హైదరాబాద్ జాతీయ ర‌హ‌దారి మార్గానికి 6 లైన్ల విస్తరణపై వినతి

గోల్లపూడి – జక్కంపూడి రహదారికి సి.ఆర్.ఐ.ఎఫ్‌ నిధుల మంజూరుకు విజ్ఞప్తి

వెస్ట్ బైపాస్ రోడ్‌లో పెద్దావుటుపల్లి – గోల్లపూడి రెండు వైపులా సర్వీస్ రోడ్లు కల్పించాలన్న విజ్ఞప్తి

  • విజయవాడ నగరంలో జాతీయ రహదారిపై అండర్‌పాస్‌లు (సబ్‌వేస్‌లు) నిర్మాణం -మంజూరు కొరుకు విజ్ఞప్తి*

సానుకూలంగా స్పందించిన గడ్క‌రీ, ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులకు ఆదేశాలు

ఢిల్లీ : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని జాతీయ రహదారుల విస్తరణ, సబ్‌వేస్‌లు, సర్వీస్ రోడ్ల ఏర్పాటు కు ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేంద్ర రోడ్లు, రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తో పార్ల‌మెంట్ లోని ఆయ‌న‌ కార్యాల‌యంలో బుధ‌వారం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ భేటీ అయ్యారు. ఈసంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజయవాడలోని ప్రధాన రహదారుల సమస్యలు, లోపాలు, అలాగే ప్రజల ప్రయాణ భద్రతకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తో చ‌ర్చించి నాలుగు అంశాల‌పై కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీకి వినతి పత్రాలు అంద‌జేశారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పున్నమి ఘాట్ వరకు 6 లైన్ల విస్తరణ కొర‌కు

విజయవాడ–హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి మార్గాన్ని మెరుగుపరచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ రహదారి NH-65లోని Km 238+000 (విజయవాడ వెస్టర్న్ బైపాస్) నుండి Km 270+500 (పున్నమి ఘాట్, భవానీపురం) వరకు మొత్తం 33 కిలోమీటర్ల పొడవు గల మార్గాన్ని ఆరు లైన్లుగా విస్తరించాల్సిన అవసరం గురించి వివ‌రించారు. ఎన్.హెచ్.ఎ.ఐ సంస్థ Km 40+000 నుండి Km 270+500 వరకు 6 లైన్ల విస్తరణకు డి.పి.ఆర్ సిద్ధం చేస్తోందని..ఆ ప్రతిపాదన ప్రకారం 6 లైన్ల ప్రణాళికను Km 238+000 వరకు మాత్రమే పరిమితం చేయడం వల్ల, భవిష్యత్తులో తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఎదురుకావ‌టంతో పాటు,ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంద‌ని తెలిపారు. ఈ మేరకు, Km 40+000 నుండి Km 270+500 వరకు మొత్తం NH-65 మార్గాన్ని 6 లైన్ల విస్తరణలో భాగంగా చేర్చాలని ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ్ఞప్తి చేశారు.

విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్‌లో రెండు వైపులా సర్వీస్ రోడ్ల కోసం

విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారి ప్యాకేజీ 3 (పెద్దావుటుపల్లి – గోల్లపూడి)లో రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవ‌సరం గురించి కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి వివ‌రించారు.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కాజా–గుండుగోలాను విజయవాడ బైపాస్ ప్రాజెక్టు నాలుగు ప్యాకేజీలుగా విభజించగా ప్యాకేజీ 3లో మాత్రం రెండు వైపులా సర్వీస్ రోడ్లను క‌ల్పించ‌లేద‌ని తెలియ‌జేశారు. ఈ ర‌హ‌దారి పల్లె ప్రాంతాలను విజయవాడ నగరానికి, రాజధాని అమరావతికి కలిపే దారిగా పనిచేస్తోందని తెలిపారు . ఇక్కడి ప్రజలు వ్యవసాయ వాహనాలతో, బుల్‌కార్ట్లతో తరచూ ప్రయాణిస్తుంటారు. ఆ వాహ‌నాల‌తో హైవే ప్ర‌యాణిస్తే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం వుంది. అందువల్ల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయించాల‌ని కోరారు.

గోల్లపూడి–జక్కంపూడి నాలుగు లైన్ రహదారి నిర్మాణానికి నిధుల మంజూరు కోసం

గోల్లపూడి జంక్షన్ నుండి జక్కంపూడి గ్రామం వరకు 5.5 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర రోడ్ల మౌలిక సదుపాయాల నిధి (CRIF) ద్వారా మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారి మచిలీపట్నం-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65), నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-163G), చెన్నై-కొల్కతా జాతీయ రహదారి (NH-16), విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ మరియు జక్కంపూడి ఎకనామిక్ సిటీ రోడ్‌లను కలుపుతుందని వివ‌రించారు

ప్రతిరోజూ సుమారు 30,000 మందికి పైగా ప్రయాణికులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారని, ప్రయాణదూరాన్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ జాములను నివారించేందుకు ఈ రహదారి నిర్మాణం అవ‌స‌ర‌మ‌ని ఎంపీ కేశినేని వివరించారు. నాలుగు లైన్ రహదారి రూపంలో అభివృద్ధి జరిగితే ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగవుతుంది, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయ‌ని తెలియ‌జేశారు.

కృష్ణలంక–ఎంజీ రోడ్, రాణిగారితోట వ‌ద్ద అత్యవసర సబ్‌వేస్‌ల నిర్మాణం కోసం

విజయవాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని జాతీయ ర‌హ‌దారి పై నుండి స్థానిక రహదారులు మూసివేయబడటంతో ప్ర‌జ‌లు కిలోమీటర్ల పొడవునా తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని తెలియ‌జేశారు. ముఖ్యంగా సెంట్ యాన్స్ హాస్పిటల్ ప్రాంతం – కృష్ణలంక నుండి ఎమ్.జి.రోడ్‌కి , వెటర్నరీ హాస్పిటల్ రోడ్ – రాణిగారితోట ప్రాంత ప్రజలు ఎమ్.జి.రోడ్‌కు నేరుగా చేరేందుకు స‌బ్ వేల నిర్మాణం అవ‌సరం గురించి వివ‌రించారు.

జాతీయ ర‌హ‌దారి పై ఈ మార్గంలో వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌టం వ‌ల్ల వైద్య సేవలు, విద్య, ఉద్యోగ ప్రయాణాలు, అత్యవసర పరిస్థితులు వంటి సేవలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎంపీ తెలిపారు. ఈ సబ్‌వేస్‌లు పూర్తయితే ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగం వుంటుంద‌ని, ప్ర‌మాదాలు త‌గ్గుతాయ‌న్నారు. ఈ సబ్‌వేస్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల‌ని కోరారు.

ఎంపి కేశినేని అభ్యర్థనలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే ఎన్ హెచ్ ఏ ఐ అధికారులకు ఆదేశాలను జారీచేశారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు పూర్తి సహాకారం అందిస్తామని ఎంపి కేశినేని శివనాథ్ కి భరోసా ఇవ్వటం జరిగింది.
.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version