ఎన్‌టీఆర్ జిల్లా, జులై 30, 2025
అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే ప్రధానం
- రెవెన్యూ సేవల దరఖాస్తులపై సత్వరం స్పందించండి
- ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవు
- జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించడం ప్రధానమని.. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ స్పష్టం చేశారు.
బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.. ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, సర్వే, పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. భూ సేకరణ, రీ సర్వే, కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఈ-కేవైసీ, ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకుల పంపిణీ తదితర అంశాలతో పాటు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కార నాణ్యత నిర్ధారణకు అర్జీదారుల సంతృప్తే గీటురాయని.. సమస్యను క్షుణ్నంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ సేవల దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో సేవలందించాలని సూచించారు. రీసర్వే కార్యకలాపాలను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేసేందుకు చొరవ చూపాలన్నారు. జాతీయ రహదారులతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ కార్యకలాపాల్లో వేగం పెంచాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పటిష్ట అమలుకు చొరవ చూపాలని, క్షేత్రస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు చౌక ధరల దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఆదేశించారు.
సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు, సర్వే-ల్యాండ్ రికార్డుల ఏడీ పి.త్రివిక్రమరావు, కేఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు.