
విజయవాడ ఉత్సవ్ 2.0లో కళా, సాంస్కృతిక పోటీలను సందర్శించిన కేశినేని జానకి లక్ష్మి
విద్యార్థులు, యువతలోని ప్రతిభను వెలికితీయడమే జిజ్ఞాస పోటీల ప్రధాన లక్ష్యం
జిజ్ఞాస, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు విశేష స్పందన
విజయవాడ( సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్/ తుమ్మలపల్లి కళాక్షేత్రం) విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా రెండో రోజు విజయవాడలోని రెండు ప్రాంతాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక, కళా సాంస్కృతిక కార్యక్రమాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మి సందర్శించారు. తొలుత విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న కార్యక్రమాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.
అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కేశినేని ఫౌండేషన్, జిజ్ఞాస ఆర్ట్ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కళా, సాంస్కృతిక పోటీల కార్యక్రమంలో జానకి లక్ష్మి పాల్గొన్నారు. సోలో క్లాసికల్ డ్యాన్స్, వోకల్, సినిమాటిక్ సోలో, తెలుగు పద్యాల పఠనం, స్టోరీ టెల్లింగ్, ఫ్యాన్సీ డ్రెస్, క్లాసికల్ డ్యాన్స్ గ్రూప్, ఇన్స్ట్రుమెంటల్, స్టోరీ రైటింగ్, క్విజ్, మ్యాజిక్ షోలు, బుర్రకథలు తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న పోటీదారులు, విజేతల వివరాలను తెలుసుకుని నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ..
“విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా కేశినేని ఫౌండేషన్, జిజ్ఞాస ఆర్ట్ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళా, సాంస్కృతిక పోటీలకు విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉంది. విద్యార్థులు, యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి తగిన వేదికను కల్పించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. వివిధ కళారూపాలు, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించడంతో పాటు, నేటి తరానికి మన వారసత్వ కళల గొప్పతనాన్ని పరిచయం చేయడం అభినందనీయం.
వివిధ విభాగాల్లో పోటీల్లో పాల్గొంటున్న చిన్నారులు, విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడతాయి. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ వారికి గుర్తింపు తీసుకురావడంలో జిజ్ఞాస, కేశినేని ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం.
నేటితో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిజ్ఞాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలు ముగియనున్నాయి. వివిధ విభాగాల్లో విజయం సాధించిన విజేతలకు పున్నమి ఘాట్లో నిర్వహించే కార్యక్రమంలో ఏడు విభాగాలకు సంబంధించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నాం. విజయవాడ ఉత్సవ్ 2.0 ద్వారా నగరంలోని కళాకారులకు, విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభిస్తోంది. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ ఈ కార్యక్రమాలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది” అని జానకి లక్ష్మి పేర్కొన్నారు.
విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు నగరంలో కళా, సాంస్కృతిక వాతావరణాన్ని మరింతగా పెంపొందించడంతో పాటు, స్థానిక ప్రతిభకు తగిన గుర్తింపు తీసుకొస్తున్నాయని ఆమె తెలిపారు.
![]()
