విజయవాడ ఉత్సవ్ 2.0లో తన గానంతో యువతను ఉర్రూతలూగించిన గీతా మాధురి .. ప్రత్యేక ఆకర్షణగా క్రాకర్స్ షో

Spread the love

ప్రేక్షకుల కేరింతలతో మారుమోగిన బసవ పున్నయ్య స్టేడియం

విజయవాడ ఉత్సవ్ 2.0లో తన గానంతో యువతను ఉర్రూతలూగించిన గీతా మాధురి .. ప్రత్యేక ఆకర్షణగా క్రాకర్స్ షో

విజయవాడ:( మాకినేని బసవ పున్నయ్య స్టేడియం)కృష్ణమ్మ తీరాన జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యువత ఆటపాటలతో సందడి చేయగా, ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లతో స్టేడియం మారుమోగింది. కామ్రేడ్ కళ్యాణ్ చిత్ర బృందం అందించిన ప్రదర్శనలు, ప్రముఖ గాయని గీతా మాధురి ఆలపించిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. చివర్లో నిర్వహించిన క్రాకర్స్ షో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కార్పొరేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విజయవాడకు ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజలను, ముఖ్యంగా యువతను కళలు, సంస్కృతి వైపు ఆకర్షిస్తూ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చే ఈ ఉత్సవాలు అభినందనీయమన్నారు. విజయవాడ అభివృద్ధితో పాటు పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించేలా ఇటువంటి వేడుకలు ఉపయోగపడతాయని తెలిపారు.

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్ 2.0ను ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడలోని కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంతో పాటు స్థానిక కళాకారులకు మంచి వేదిక కల్పించడమే ఉత్సవ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు, నగరంలోని సాంస్కృతిక వైభవాన్ని మరింత విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని అన్నారు. ప్రజల ఆదరణతో విజయవాడ ఉత్సవ్‌ను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్ 2.0 నగర ప్రజలకు వినోదంతో పాటు సాంస్కృతిక అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్న ఈ వేడుకలు విజయవాడ ఐక్యతను, కళా వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. యువతకు ప్రోత్సాహం అందిస్తూ, ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తున్న విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంగీత ప్రదర్శనలు, ఉత్సాహభరితమైన నృత్యాలు, యువత కేరింతలు, కన్నులపండువగా సాగిన క్రాకర్స్ షోతో మాకినేని బసవ పున్నయ్య స్టేడియం సందడిగా మారింది. విజయవాడ ఉత్సవ్ 2.0లో ఈ కార్యక్రమం ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించింది.

Loading