దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నాం

Spread the love

దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నాం

ఉత్సవ ప్రాంగణాల్లో వ్యర్థాల సేకరణకు 2,500 డస్ట్‌బిన్ల ఏర్పాటు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృత పారిశుద్ధ్య చర్యలు చేపడుతూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కెనాల్ రోడ్, సీతమ్మవారి పాదాలు, వినాయకుని గుడి, హోల్డింగ్ ఏరియా తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు ఉత్సవ ప్రాంగణాలు, భక్తుల రాకపోకలు సాగించే ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణ కోసం 2,500 డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేకరించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా ఉత్సవ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

భక్తులకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిరంతరం ఫాగింగ్, ఎంఎల్ ఆయిల్ స్ప్రేయింగ్ వంటి చర్యలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు. ఉత్సవాల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ కోసం సుమారు 1,400 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు, వాహనాలు, డ్రైవర్లు, పర్యవేక్షణ అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది సహా మొత్తం దాదాపు 2,000 మంది ప్రత్యేకంగా పారిశుధ్య నిర్వహణకు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య పనులు, వాహనాల వినియోగం, క్షేత్రస్థాయి ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తూ అమ్మవారి దర్శనం సౌకర్యవంతంగా జరిగేలా చర్యలు చేపట్టడం విజయవాడ నగరపాలక సంస్థకు గర్వకారణమని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.

ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ నిర్మల గ్లోరీ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ

Loading