
సరస్ మేళాకు వచ్చే ‘లఖ్‌పతి దీదీ’ల పిల్లల కోసం ప్రత్యేక క్రెష్ ఏర్పాటు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడలో అక్టోబర్ 13 నుంచి 31వ తేదీ వరకు భవానీపురం పున్నమి ఘాట్ వద్ద నిర్వహించనున్న జాతీయ స్థాయి సరస్ మేళా–2026కు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ‘లఖ్‌పతి దీదీ’ల పిల్లల సంరక్షణ కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రెష్ (శిశు సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
సోమవారం ఉదయం పున్నమి ఘాట్ వద్ద సరస్ మేళా ఏర్పాట్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల నుంచి సరస్ మేళాలో పాల్గొనే మహిళలు తమ పిల్లలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక క్రెష్‌లో ఉంచి, పిల్లల సంరక్షణపై ఆందోళన లేకుండా తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించవచ్చని తెలిపారు. మహిళలకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, పిల్లలకు సురక్షితమైన సంరక్షణ అందించడమే ఈ ప్రత్యేక ఏర్పాట్ల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేయనున్న క్రెష్‌ల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేలా సరస్ మేళాలో ప్రత్యేక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సరస్ మేళాకు వచ్చే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, వాడుక నీటి పారుదల తదితర ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మేళా ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడంతో పాటు, కార్యక్రమం ముగిసే వరకు అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. అన్నపూర్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
![]()
