
కూటమి అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి: మాజీ మంత్రి వెలంపల్లి
పశ్చిమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది: వెలంపల్లి.
కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది: వెలంపల్లి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నామినేషన్ పత్రాలను చించేస్తున్నారు: వెలంపల్లి
ఆర్వోల ఎదుటే నామినేషన్ పత్రాలు లాక్కుంటున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు: వెలంపల్లి
వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేసి తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు: వెలంపల్లి
వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయం?: వెలంపల్లి
రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోంది.. ప్రజలు శాంతియుత పాలన కోరుకుంటున్నారు: వెలంపల్లి
జగన్ హయాంలో సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా అందితే, కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ అటకెక్కించింది: వెలంపల్లి
ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా?: వెలంపల్లి
విజయవాడ పశ్చిమ 50వ డివిజన్ నుంచే కూటమి పతనానికి నాంది పలుకుతాం: వెలంపల్లి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 50వ డివిజన్ పంజా సెంటర్ వద్ద శనివారం సాయంత్రం భారీ ఎన్నికల ప్రచార పాదయాత్ర ప్రారంభమైంది. మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ అఫ్సర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్, పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, కార్యకర్తల తో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటు వేసి విజయవాడ నగర మేయర్ వైఎస్సార్సీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిని, 50వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ అఫ్సర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ షేక్ అఫ్సర్ 50వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా, రాయన భాగ్యలక్ష్మి గారు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, వారి అభ్యర్థిత్వాలను బలపరుస్తూ ఓట్లు అభ్యర్థించడానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని దాదాపు అన్ని డివిజన్లలో పర్యటించానని, 50వ డివిజన్‌తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల సంక్షేమ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ రెండున్నర సంవత్సరాల పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వెలంపల్లి మండిపడ్డారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపకుండా పల్నాడు, రాయలసీమతో సహా పలు జిల్లాల్లో దౌర్జన్యాలు చేస్తూ నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారని, అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు చేయడమే కాకుండా, తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తూ ఆర్వో ఎదుటే నామినేషన్ పత్రాలు లాక్కుని వెళ్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, కూటమి పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్నటికి నిన్న బలహీన వర్గాలకు చెందిన మాజీ మంత్రి విడదల రజిని గారి పట్ల కూటమి నాయకులు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారని వెలంపల్లి ఆరోపించారు. తమ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వాలని అడగడం పెద్ద తప్పా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు నామినేషన్లు వేస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయమని, ప్రజాక్షేత్రంలో ఇప్పటికే అర్హత కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు, నిష్పాక్షిక పాలన కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను నిలిపివేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని చెప్పారు. కూటమి నాయకులు వ్యాన్లలో తిరుగుతూ దణ్ణాలు పెట్టుకుని వెళ్ళడం తప్ప, ప్రజల మధ్యకు వచ్చి దుకాణాల వద్దకు వెళ్లి మాట్లాడే ధైర్యం వారికి లేదని, అలా వస్తే ప్రజల నుంచి ఛీత్కారాలు తప్పవని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో 45 ఏళ్లు దాటిన మహిళలకు ‘చేయూత’, కాపులకు ‘కాపు నేస్తం’, ఓసీ పేదలకు ‘ఈబీసీ నేస్తం’ ద్వారా ఏటా క్రమం తప్పకుండా ₹18,000 అందించారని గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం 18 ఏళ్లకే ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని చెప్పి నేడు ఆడబిడ్డలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తోందని ఎద్దేవా చేశారు.
అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని, నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పిన పెద్దమనుషులు, నేడు 60 ఏళ్లు నిండిన వారికి కూడా సరిగ్గా పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని, ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టేందుకు దరఖాస్తులు సేకరించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ మార్పుకు నాంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ నుంచే ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో 50వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ అఫ్సర్, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు
![]()
