జగన్ క్రిమినల్ ఆలోచనలు, కుట్రలపై సిట్ వేయాలని ఎస్ఈసీని కోరిన కూటమి నేతలు

Spread the love

జగన్ క్రిమినల్ ఆలోచనలు, కుట్రలపై సిట్ వేయాలని ఎస్ఈసీని కోరిన కూటమి నేతలు

  • రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ దౌర్జన్యాలు, అరాచక ఘటనలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు
  • కంజరభట్స్, రామంతపూర్ నేర ముఠాల కంటే ప్రమాదకరంగా ‘జగన్ గ్యాంగ్’ తీరు ఉందని మండిపడ్డ ఎమ్మెల్సీ వర్ల
  • టీడీపీకి దీటుగా నామినేషన్లు వేసి.. బయటేమో దొంగ ఏడుపులా?
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్రిమినల్ మనస్తత్వం బయటపడిందన్న చిల్లపల్లి శ్రీనివాసరావు
  • దొంగే దొంగ అన్నట్టు వైసీపీ తీరు.. జగన్ నాటకాలు ఇక సాగవున్న పాతూరి నాగభూషణం

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ పన్నిన కుట్రలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు నేడు కూటమి పార్టీ నేతల ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో తమకు పట్టు ఉన్న ప్రకాశం, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సాగించిన దాడులు, విధ్వంసాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, జనసేన నేత, ఏపీఎంఐఎస్‌డీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర నేత పాతూరి నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్.రాజశేఖర్‌, ఏపీ బయోడైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, బీజేపీ నేత శ్రీనివాసరావులతో కూడిన బృందం ఎన్నికల కమిషనర్‌కు సమగ్ర లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. ప్రకాశం, రాయలసీమ తదితర ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కూటమి అభ్యర్థులు, పోలీసులపై వైసీపీ గూండాలు సాగించిన దౌర్జన్యాలు, బెదిరింపులు, వాహనాల ధ్వంసానికి సంబంధించిన స్పష్టమైన వీడియో ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఎన్నికల కమిషనర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలనే దురుద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నేరపూరిత కుట్రకు తెరలేపిందని తీవ్రంగా మండిపడ్డారు. గత తొమ్మిది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం వైపే ప్రజలు ఉన్నారనే విషయం స్పష్టమైంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ప్రజలు తమను అంగీకరించరని, గెలిచే దాఖలాలు ఏమాత్రం లేవని నిర్ధారణకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, ఎన్నికలను ఎలాగైనా నిలిపివేయాలనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో నేర చరిత్ర కలిగిన కంజరభట్స్ గ్యాంగ్, రామంతపూర్ గ్యాంగ్, నాందేడ్ గ్యాంగ్, స్టువర్టుపురం గ్యాంగ్ లాంటి ఆరితేరిన ముఠాలు ఎంత పక్కా ప్లాన్ ప్రకారం నేరాలు చేసేవో, సరిగ్గా అదే పద్ధతిలో నేడు జగన్ మోహన్ రెడ్డి గారి బృందం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ రోజున ఆ ముఠాల జాబితాలో ‘జగన్ గ్యాంగ్’ కూడా చేరిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదన్నారు. వాళ్లే దాడులు చేయడం, తిరిగి తామే బాధితులమంటూ అబద్ధాలు ప్రచారం చేయడం అలవాటుగా మార్చుకున్నారని ఆరోపించారు. వాళ్లే నామినేషన్ పత్రాలు చించుకోవడం, పోలీసులను కొట్టడం, బారికేడ్లు పడేయడం వంటి పనులు చేసి, వాటిని కూటమి నేతలపైకి నెట్టేందుకు తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నామినేషన్లు వేయనివ్వడం లేదంటూ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని విమర్శించారు. మున్సిపాలిటీలలో తెలుగుదేశం పార్టీ 8,774 నామినేషన్లు దాఖలు చేస్తే, వైఎస్సార్సీపీ ఏకంగా 8,128 నామినేషన్లు వేసింది. జెడ్పీటీసీలు టీడీపీ 2,078 నామినేషన్లు వేయగా, వైఎస్సార్సీపీ 1,815 నామినేషన్లు వేసింది. ఎంపీటీసీలు టీడీపీ 22,013 నామినేషన్లు దాఖలు చేస్తే, వైఎస్సార్సీపీ 20,556 నామినేషన్లు వేసింది. ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు వేసిన తర్వాత కూడా, వారిని ఎవరు అడ్డుకున్నారో, ఎక్కడ ఆటంకాలు ఎదురయ్యాయో జగన్ మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ నేతలు కుట్ర పన్ని చేసిన నేరాలన్నింటినీ ఒక పట్టిక రూపంలో పొందుపరిచి, అందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పెన్ డ్రైవ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సమర్పించాం. ఈ వ్యవస్థీకృత అరాచకాలపై పూర్తిస్థాయి విచారణ నిమిత్తం డిజిపి గారికి ఆదేశాలు జారీ చేసి, వెంటనే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరాము. రాజకీయ ముసుగులో నేరపూరిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదు. అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి వారి పార్టీ గుర్తింపును సైతం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాం. మా వినతిపై స్పందించిన కమిషనర్ గారు, ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జనసేన నేత, ఏపీఎంఐఎస్‌డీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో 2021లో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడ్డారో, నేడు అధికారం కోల్పోయినా వారి క్రిమినల్ మనస్తత్వాన్ని మార్చుకోలేదని మండిపడ్డారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో తమకు ఎక్కడైతే కాస్త బలం ఉందని భావిస్తున్నారో, అక్కడ ఉద్దేశపూర్వకంగా ఘర్షణలకు దిగుతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కేవలం ఈ ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా నామినేషన్లు ఎంతో చురుగ్గా, పోటాపోటీగా జరిగాయి. అలాంటప్పుడు వైఎస్సార్సీపీ నేతలు దొంగ మాటలు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. దాదాపు 20 వేల మంది కొత్తగా ప్రజా నాయకత్వంలోకి వచ్చి, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమయ్యారు. అది ఏ పార్టీ వారైనా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకొచ్చినప్పుడు, ఎన్నికలు సజావుగా సాగితే తమ ఉనికి ఎక్కడ గల్లంతవుతుందోనన్న భయంతోనే వైఎస్సార్సీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, మంచి పాలనను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని తెలిపారు. ప్రభుత్వం సాధిస్తున్న ఫలితాలను, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ ఇలాంటి విన్యాసాలకు తెరలేపిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న అరాచకాలకు సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఇప్పటికే కమిషన్ చర్యలు ప్రారంభించిందని, ఘర్షణలు, దౌర్జన్యాలకు కారణమైన వారిపై ‘సిట్’ ఏర్పాటు చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి పార్టీల తరఫున విజ్ఞప్తి చేసినట్లు స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర నేత పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా పూర్తయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏడాదికి సుమారు ₹15,000 కోట్ల నిధులు వస్తాయి. ఆ నిధులు రాకుండా అడ్డుకోవడమే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశమని, అందుకే ఎన్నికలు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియలో ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ వరకే వైసీపీ శ్రేణులు గొడవలు, అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేశాయి. అయితే అక్కడ కూడా ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పడంతో పట్టు కోల్పోయారు. గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. దొంగతనం చేసినవాడే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ‘నా ఇంట్లో దొంగలు పడ్డారు’ అని ఫిర్యాదు చేసిన విధంగా వైసీపీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. తామే గందరగోళం సృష్టించి, తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘం, గవర్నర్, సుప్రీంకోర్టుల చుట్టూ వాళ్లే తిరుగుతున్నారని మండిపడ్డారు. 2021లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని, పరిశీలన (స్క్రూటినీ) పేరిట తిరస్కరించి దారుణ అరాచకాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’ అన్నట్లు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా తమలాగే చేస్తుందనే భయంతో వైసీపీ లేనిపోని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 5 వరకు అమలులో ఉంది. ఆలోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, అల్లర్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసమే ప్రత్యక్ష సాక్ష్యాలుగా వీడియో క్లిప్పింగ్స్, వార్తాపత్రికల ఆధారాలను సమర్పిస్తూ ‘సిట్’ ఏర్పాటు చేయాలని కూటమి పక్షాల తరపున గట్టిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షులతో కూడిన కూటమి సమన్వయంతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తోందని చెప్పారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసి, అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీన్ని జీర్ణించుకోలేకే వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా, కుతంత్రాలు పన్నినా డిసెంబర్ 5 తర్వాత ఫలితాలు కూటమికి అనుకూలంగానే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్న ఇటువంటి అరాచక శక్తుల నిజస్వరూపాన్ని మీడియా ప్రతినిధులు ప్రజల ముందు నిర్భయంగా బయటపెట్టాలని ఆయన కోరారు.

Loading