విజయవాడ నగరపాలక సంస్థ
28-07-2025
వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు తీసుకోవాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యాటన లో భాగంగా రామలింగేశ్వర నగర్, భూపేష్ గుప్తా నగర్, సాయిరాం కట్ పీసెస్ రోడ్, తారక రామా నగర్, రణదేవ్ నగర్ మెట్లబజార్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కృష్ణా నదిలో ప్రవాహం ఎక్కువైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విజయవాడ నగర పాలక సంస్థ వారు చేయాల్సిన చర్యలు ఎలాంటివి, వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కృష్ణ నదిలో నీటి ప్రవాహం ఎక్కువైతే ఏ ఏ ప్రాంతాల నుండి నీరు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి వస్తాయి, అక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకోవాల్సిన మోటర్లు, పంప్ సెట్ లు, ఆయిల్ ఇంజన్లు ఎక్కువ సామర్థ్యం గలవి ముందుగానే చేకూర్చుకొని ఉండమని అధికారులను ఆదేశించారు. ఒకవేళ కృష్ణా నదిలో ప్రవాహం ఎక్కువై వరదలుగా మారే అవకాశం ఉన్నప్పుడు ప్రజలకు పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో ముందుగానే తెలియపరచి ఆపద సమయంలో వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడే అవకాశాలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దగ్గరలో గల పునరావస కేంద్రాలు గుర్తించి వాటిలో ప్రజలకు అవసరమయ్యే కనీస సౌకర్యాలు కల్పించేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమ్మీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్,పర్యవేక్షణ ఇంజనీర్ పి. సత్య కుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.