ఎన్‌టీఆర్ జిల్లా, జులై 31, 2025
ఫొటోగ్రఫీ ఎంట్రీలకు గడువు పొడిగింపు
- ఆగస్టు 2వ తేదీలోగా ఎంట్రీలు పంపాలి
- స్టూడియో ఫొటోగ్రాఫర్లకూ అవకాశం కల్పిస్తున్నాం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేసేందుకు నిర్వహిస్తున్న ఫొటోగ్రఫీ పోటీల ఎంట్రీల గడువును ఫొటోగ్రాఫర్ల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీలకు ఎంట్రీల గడువును జులై 31వ తేదీగా నిర్ధారించడం జరిగిందని.. ఈ నేపథ్యంలో ఫొటోగ్రాఫర్లు మరో రెండు రోజులు గడువుకావాలని విజ్ఞప్తి చేసిన దరిమిలా ఆగస్టు 2వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్న కలెక్టర్ తెలిపారు.
ఫొటో జర్నలిస్టులతో పాటు జిల్లాకు చెందిన స్టూడియో ఫొటోగ్రాఫర్లకు కూడా అవకాశం కల్పిస్తున్నామని, వారు కూడా ఎంట్రీలు పంపొచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఉత్తమ న్యూస్ ఫొటో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి విభాగం కింద జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, స్వచ్ఛాంధ్ర/స్వచ్ఛ ఎన్‌టీఆర్, యోగాంధ్ర అంశాలకు సంబంధించి ఫొటో ఎంట్రీలు పంపొచ్చన్నారు. రెండో విభాగంలో తల్లికి వందనం/విద్య, ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం – 2 ఉన్నాయని, మూడో విభాగంలో అత్యుత్తమ న్యూస్ ఫొటో పోటీ ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ (రూ. 10 వేలు), ద్వితీయ (రూ. 7,000), తృతీయ (రూ. 4 వేలు) బహుమతులతో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు వివరించారు. ఒక ఫొటోగ్రాఫర్ ఒక సెక్షన్ నుంచి మూడు ఫొటోలు, అదేవిధంగా మొత్తం మూడు సెక్షన్ల నుంచి తొమ్మిది ఫొటోలు పంపవచ్చని, 2024, జూన్ 12 నుంచి 2025, జులై 31 మధ్య తీసిన ఫొటోలై ఉండాలన్నారు. ఫొటో సైజు 12X10 ఉండాలని, ఫొటోలు ఎన్‌టీఆర్ జిల్లాలో మాత్రమే తీసి, పబ్లిసిటీకి మాత్రమే ఉపయోగించేవిగా ఉండాలని సూచించారు. ఒరిజినల్ ఫొటోలతో ఎంట్రీలను విజయవాడ గోపాల్‌రెడ్డి రోడ్డులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం ఆవరణంలో గల డీపీఆర్‌వో కార్యాలయంనందు అందజేయాలని, ఇతర వివరాలకు 9121215373 నంబర్లో సంప్రదించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.