04-07-2025
నగర వైభవాన్ని చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్
దసరా ఉత్సవాల సమయంలో నిర్వహించేందుకు కసరత్తు
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏటా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయని.. దసరా ఉత్సవాల సమయంలో విజయవాడ నగర వైభవాన్ని చాటిచెప్పేలా.. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, కళా వారసత్వాన్ని ప్రతిబింబించేలా విజయవాడ ఉత్సవ్ ఆలోచనకు కార్యరూపమిచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో విజయవాడ ఉత్సవ్‌పై జరిగిన ప్రాథమిక సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొని ఉత్సవ నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక వారసత్వ సంపదకు వన్నె తెచ్చేలా, పర్యాటకాన్ని ప్రోత్సహించేలా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. విజ్ఞానం, వినోదాన్ని మేళవించి ఏయే కార్యక్రమాలను నిర్వహిస్తే బాగుంటుందనే దానిపై అభిప్రాయాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి మన రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు విజయవాడ నగర పర్యటన మధురానుభూతులు మిగిల్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిపారు. హరిత బెరం పార్కు, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్, పవిత్ర సంగమం, తుమ్మలపల్లి కళాక్షేత్రం తదితర ప్రాంతాల్లో వైవిధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.
జానపద కళలను ప్రోత్సహించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఫుడ్ ఫెస్ట్‌లు, వాటర్ స్పోర్ట్స్, డ్రోన్ షో, లేజర్ షో, థీమ్ బ్యూటిఫికేషన్ వంటివాటిపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. అందరి సలహాలు సూచనలను పరిగణనలోకి తీసుకొని విజయవాడ ఫెస్ట్ నిర్వహణకు ముందుకెళ్తామని ఎంపీ చిన్ని తెలిపారు. సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.