ఎన్‌టీఆర్ జిల్లా, జులై 30, 2025
కృష్ణా నది వరదలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నాం
- అధికారులందరినీ అప్రమత్తం చేశాం
- ప్రజలు ధైర్యంగా, జాగ్రత్తగా ఉండాలి
- వరదలపై వదంతులను నమ్మవద్దు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎగువన వర్షాలు పడటంతో పులిచింతల నుంచి 60 వేల క్యూసెక్కులుకు పైగా వరద నీరు రావడంతో.. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లలో 55 గేట్లను అడుగుపైకి, 15 గేట్లను రెండు అడుగులు పైకి ఎత్తి నీటిని కిందకు వదిలేయడం జరుగుతోందని.. వరదల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
బుధవారం సాయంత్రం కలెక్టర్ లక్ష్మీశ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారుల నుంచి వరద నీటి ప్రవాహానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం నాటికి లక్ష క్యూసెక్కులకు, రెండు రోజుల్లో మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని, ఈ నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని.. బ్యారేజీ ఎగువ, దిగువ వైపుల ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించామన్నారు. విజయవాడలో దాదాపు 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించామని.. వీటిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలో పునరావాస కేంద్రాలతో మ్యాప్ చేసినట్లు తెలిపారు. ఒకవేళ ముంపు ముప్పు ఉన్నట్లయితే ఈ కేంద్రాలను తరలిస్తామని వివరించారు. డ్రెయినేజీ వ్యవస్థలు సరైన విధంగా ఉండేలా నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బుడమేరు, పులివాగు, కోతుల వాగు తదితర ప్రాంతాల విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నామన్నారు. వరదలపై జిల్లా కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. ఇది 24 గంటలూ పనిచేస్తుందని, ఎవరైనా సమస్యలను కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని.. వచ్చే రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భయపడాల్సిన పనిలేదని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతోనూ సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ఈ ఆర్.మోహనరావు, ఈఈ ఆర్.రవికిరణ్, డీఈ ఎన్.అజయ్‌బాబు, బ్యారేజ్ జేఈ సత్య రాజేష్ తదితరులు ఉన్నారు.