ఇంద్ర‌కీలాద్రిపై సెప్టెంబ‌ర్ 22 నుంచి ద‌స‌రా మ‌హోత్స‌వాలు అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు 11 రోజుల పాటు వైభ‌వంగా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌ ఆల‌య ఈవో వీకే శీనానాయ‌క్‌

0

విజ‌య‌వాడ‌, జులై 28, 2025 ఇంద్ర‌కీలాద్రిపై సెప్టెంబ‌ర్ 22 నుంచి ద‌స‌రా మ‌హోత్స‌వాలు అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు 11 రోజుల పాటు వైభ‌వంగా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌ ఆల‌య ఈవో వీకే శీనానాయ‌క్‌ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను సెప్టెంబ‌ర్ 22వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి వీకే శీనానాయ‌క్ తెలిపారు.సెప్టెంబ‌ర్ 22 నుంచి ఇంద్ర‌కీలాద్రిపై నిర్వ‌హించ‌నున్న ద‌స‌రా మ‌హోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై సోమ‌వారం కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి వీకే శీనానాయ‌క్ .. వైదిక క‌మిటీ స‌భ్యులు, వేద‌పండితుల‌తో క‌లిసి మీడియా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన ప‌త్రిక‌ను విడుద‌ల చేశారు. అనంత‌రం ఈవో మాట్లాడుతూ శ్రీ విశ్వావ‌సు నామ సంవ‌త్స‌ర ద‌స‌రా మ‌హోత్స‌వాల‌ను సెప్టెంబ‌ర్ 22 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని వైదిక క‌మిటీ నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ద‌స‌రా మ‌హోత్స‌వాల‌కు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాలు, దేశ‌విదేశాల నుంచి పెద్దఎత్తున భ‌క్తులు అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తార‌న్నారు. భ‌క్తుల మ‌నోభావాల‌కు అనుగుణంగా సాధార‌ణ భ‌క్తుల‌కు అమ్మ‌వారి ద‌ర్శ‌నం త్వ‌రిత‌గ‌తిన జ‌రిగేలా ఏర్పాట్లు చేసేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దేవాదాయ శాఖామాత్యులు, క‌మిష‌న‌ర్, ఇత‌ర ఉన్న‌తాధికారుల సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ద‌స‌రా ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభ‌ట్ల శివ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల్లో భాగంగా శ్రీ విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రంలో నిర్వ‌హించే ఉత్స‌వాల్లో అమ్మ‌వారు 11 రోజుల‌పాటు 11 అవ‌తారాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌న్నారు. 22వ తేదీన ఆశ్వీయుజ శుద్ధ పాడ్య‌మి నాడు అమ్మ‌వారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని.. 23వ తేదీన శ్రీ గాయత్రీ దేవి, 24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి, 25వ తేదీన శ్రీ కాత్యాయ‌ని దేవి, 26వ తేదీన శ్రీ మహాలక్ష్మీ దేవి, 27వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, 28వ తేదీన శ్రీమహా చండీ దేవి, 29వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి, 30వ తేదీన శ్రీ దుర్గాదేవి, అక్టోబ‌ర్ 1న శ్రీ మహిషాసురమర్దినీ దేవి, అక్టోబ‌ర్ 2న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిస్తార‌ని వివ‌రించారు. మూలా న‌క్ష‌త్రం రోజున రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రివ‌ర్యులు అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌న్నారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. ఏటా మాదిరిగానే అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తామ‌ని, ప్ర‌తిరోజు నగరోత్సవం జ‌రుగుతాయ‌ని శివ ప్ర‌సాద్ శ‌ర్మ వివ‌రించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు మరియు వైదిక కమిటీ సభ్యులు ఎల్.దుర్గా ప్రసాద్ వైదిక కమిటీ సభ్యులు చింతపల్లి ఆంజనేయ గణాపాటి వేదపండితులు మహర్షి అర్చకులు శ్రీధర్ శర్మ ఆలయ ఎఈఒ లు వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version