విజయవాడ, అక్టోబర్ 06, 2026
అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు

- సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పటిష్ట ఏర్పాట్లు
- 25 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా
- గౌరవ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
- వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వచ్చేందుకు అవకాశం
- మూడు క్యూలైన్లలోనూ భక్తులకు ఉచితంగా దర్శన ఏర్పాట్లు
- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా దసరా మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు 25 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్లు సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టామని వెల్లడించారు.
మంగళవారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సమావేశ మందిరంలో దసరా ఉత్సవాలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన మంత్రుల బృందం (జీవోఎం).. అధికారులతో సమావేశమైంది. మంత్రులు సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్రతో పాటు స్థానిక శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి, దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె.రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సభ్యులతో పాటు
ఈవో వీకే శీనా నాయక్ తదితరులు హాజరైన సమావేశంలో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వారి భద్రత, సౌకర్యాలు, సులభ దర్శనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల సమన్వయంతో చేసిన ఏర్పాట్లతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన వినూత్న కార్యాచరణను కలెక్టర్, పోలీస్ కమిషనర్ వివరించారు. భక్తుల రాకపోకలు, దర్శన క్యూలైన్లలో సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, కమాండ్ కంట్రోల్ కేంద్రం తదితర అంశాలపై రూపొందించిన సమగ్ర ప్రణాళికను వివరించారు. ప్రణాళికల విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ధర్తకర్తలమండలి సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత సంతృప్తికర దర్శనం లభించేలా, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, రవాణా తదితర అంశాల్లో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మూడు క్యూలైన్లలోనూ అన్ని రోజులపాటు ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈసారి రైల్వే సహకారంతో ఏడువేల మంది సామర్థ్యంతో మూడో హోల్డింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశామని.. హోల్డింగ్ ఏరియాల్లో అన్న ప్రసాదాన్ని కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 24 గంటలూ సేవలందించే సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ)అందుబాటులో ఉంటుందన్నారు. దసరా ఉత్సవాలతో పాటు సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ జరగనున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14న గౌరవ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రత, ఇతర అంశాల పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని, అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దసరా ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉన్నందున, వారి పర్యటనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కుటుంబంతో కలిసి మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణకు సమష్టిగా కృషిచేయనున్నట్లు పేర్కొన్నారు.
![]()
