విజయవాడ, అక్టోబర్ 07, 2026
పతకం ఒక్కటే కాదు.. పీ4 స్ఫూర్తికి ఘన విజయం!

- ఫలించిన జిల్లా కలెక్టర్ చొరవ.. కృపారావు బంగారు విజయం
కెనడాలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జి.కొండూరు మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు సంకు కృపారావు బంగారు పతకం సాధించి ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చారు. ఈ విజయం వెనుక ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ4 స్ఫూర్తి పథం కూడా ఉంది. క్రీడాకారున్ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం కలెక్టరేట్‌లో అభినందించారు. మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను ఇటీవల కృపారావు కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ లక్ష్మీశ వెంటనే స్పందించి.. పీ4 ద్వారా సహకారం అందేలా చొరవచూపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పీ4 కార్యక్రమం ద్వారా మార్గదర్శిగా ముందుకు వచ్చిన సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను క్రీడాకారుడికి సహాయం అందించేలా అనుసంధానించి.. రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇప్పటికే వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన కృపారావు కెనడాలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. అంతేకాకుండా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్‌గా నిలిచారు. ఆయన సంకల్పం సాకారం కావాలని, ఆయన విజయంతో ఎన్టీఆర్ జిల్లా పేరు అంతర్జాతీయ క్రీడా వేదికపై మార్మోగాలని కలెక్టర్ లక్ష్మీశ గతంలో ఆకాంక్షించగా అది నేడు నిజమైంది.
![]()
