స‌జావుగా నామినేష‌న్ల ప్ర‌క్రియ‌..

Spread the love

విజ‌య‌వాడ గ్రామీణం, న‌వంబ‌ర్ 16, 2026

స‌జావుగా నామినేష‌న్ల ప్ర‌క్రియ‌..

  • ప్ర‌క్రియ‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌
  • ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

జిల్లాలో పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ‌కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సజావుగా జ‌రుగుతోంద‌ని.. ఎన్నిక‌ల‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టిన‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం జిల్లా పంచాయ‌తీ అధికారి (డీపీవో) టి.సీతామ‌హాల‌క్ష్మితో క‌లిసి విజ‌య‌వాడ గ్రామీణం గొల్ల‌పూడి పంచాయ‌తీ కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. జ‌రుగుతున్న నామినేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు, ఎన్నికల నిబంధనల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క‌చ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామ‌ని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వ‌హించేలా చూస్తున్న‌ట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. మొద‌టి విడ‌త‌లో 73 గ్రామ పంచాయతీలు, 856 వార్డుల‌కు 1,001 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్నారు. తొలిద‌శ ఎన్నిక‌ల‌కు ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ఉంద‌ని.. ఈ నెల 26వ తేదీన పోలింగ్ జ‌రుగుతుంద‌ని.. అదే రోజు కౌంటింగ్‌, ఫ‌లితాల వెల్ల‌డి జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

Loading