తిరువూరు నియోజకవర్గంలో టీడీపీలోకి భారీగా వైసీపీ శ్రేణుల చేరికలు

Spread the love

తిరువూరు నియోజకవర్గంలో టీడీపీలోకి భారీగా వైసీపీ శ్రేణుల చేరికలు

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు

విజయవాడ(ఎంపీ కార్యాలయం)తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం బలపడుతోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, ఏ.కొండూరు మండలాలకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం విజయవాడ లోని ఎంపీ కార్యాలయం నందు టీడీపీలో చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన బల్లెపోగు బాబురావు తన అనుచరులతో కలిసి మొత్తం 25 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటాయని తెలిపారు. పార్టీలోకి వచ్చిన వారిని కొత్తవారిగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తామని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆంజనేయపురం మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు మామిడి గాంధీ, తిరువూరు నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షులు తుమ్మలపల్లి వెంకట పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

ఏ.కొండూరు మండలంలోనూ వైసీపీ నాయకులు, కార్యకర్తల చేరికలు

మరోవైపు ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మొత్తం 20 మంది టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరగా, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఏ.కొండూరు మండలంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మంచి కంటి రాజశేఖర్, ఆయన సతీమణి విజయలక్ష్మి, మెంతుల శ్రీనివాస్ యాదవ్, బాలమర్తి కృష్ణ తదితరులు టీడీపీలో చేరడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసంతో చేరిన వారందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఐక్యతతో పనిచేస్తూ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏ.కొండూరు మండల టీడీపీ అధ్యక్షులు పీక్లా నాయక్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.రెండు మండలాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి జరిగిన ఈ చేరికలు తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ అందరినీ కలుపుకొని పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు.

Loading