
అర్నబ్ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ ట్రాఫిక్ పోలీసుల నిరంతర అప్రమత్తత..
అర్నబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల్లో ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ – విఎంసి సిబ్బందితో సమన్వయంతో తక్షణ చర్యలు
అర్నబ్ తుఫాను ప్రభావంతో విజయవాడ నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం, ఐపీఎస్ ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఏసీపీల పర్యవేక్షణలో ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్, జమ్మిచెట్టు సెంటర్, ఎం.జి. రోడ్, ఏలూరు రోడ్, బందర్ రోడ్, రమేష్ హాస్పిటల్ జంక్షన్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నీటి నిల్వలను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట్ల వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధుల్లో ట్రాఫిక్ పోలీసులు
ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ట్రాఫిక్ పోలీసులు వర్షంలోనూ క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నారు. సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అసౌకర్యం తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ విధి నిర్వహణ పట్ల చూపుతున్న నిబద్ధత, అప్రమత్తత ప్రజాసేవ పట్ల ట్రాఫిక్ పోలీసుల అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వర్షాల సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపాలి. ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించాలి. నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలనీ విజ్ఞప్తి చేశారు.
![]()
