
తుపాను ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. మత్స్యకారుల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యం
- సముద్రంలో ఉన్న 91 మత్స్య5కార బోట్లను సురక్షితంగా తీరానికి చేర్చేందుకు చర్యలు చేపట్టాలి
- రాష్ట్రవ్యాప్తంగా 30,043 బోట్లలో 29,952 బోట్లు తీరానికి చేరుకున్నాయి
- అన్ని తీరప్రాంత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు.. నిరంతర పర్యవేక్షణ
- మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దు
- రైతులు పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, అక్టోబర్ 24: బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం తుపానుగా మారే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు శనివారం మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడి తుపాను ప్రభావం, సముద్రంలో ఉన్న మత్స్యకార బోట్ల పరిస్థితి, తీరప్రాంత జిల్లాల్లో చేపట్టిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 26 నాటికి తుపాను ఏర్పడి, 28 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 30,043 మత్స్యకార బోట్లలో 29,952 బోట్లు హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో సురక్షితంగా ఉండగా, మరో 91 బోట్లు సముద్రంలో ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. వీటిలో విశాఖపట్నం జిల్లాలో 37, అనకాపల్లిలో 1, కాకినాడలో 1, కృష్ణా జిల్లాలో 20, బాపట్ల జిల్లాలో 32 బోట్లు ఉన్నట్లు తెలిపారు. సముద్రంలో ఉన్న 91 బోట్లలో 72 మెకనైజ్డ్, 19 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ బోట్లన్నీ వీలైనంత త్వరగా సురక్షితంగా తీరానికి చేరుకునేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మత్స్యకార సంఘాలు, బోటు యజమానులు, హార్బర్ అధికారులు, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సముద్రంలో ఉన్న ప్రతి బోటు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు 1,053 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉందని, రాష్ట్రంలోని 12 తీరప్రాంత జిల్లాల పరిధిలో 555 సముద్ర మత్స్యకార గ్రామాలు, 350 చేపల ల్యాండింగ్ కేంద్రాలు, ఉన్నాయని తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరూ తమ పడవలతో తక్షణమే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని తీరప్రాంత జిల్లాల్లో జిల్లా మత్స్యశాఖ అధికారులు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ రామశంకర్ నాయక్ మంత్రికి వివరించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని, తీరప్రాంత గ్రామాల్లో తుపాను హెచ్చరికలపై విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల తదితర తీరప్రాంత జిల్లాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సముద్రంలో అలల ఉద్ధృతి, బలమైన గాలుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని బోట్లు, వలలు, ఇతర మత్స్యకార సామగ్రిని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ముఖ్యంగా కోత దశకు చేరుకున్న పంటలు, కోసిన ధాన్యం, ఉద్యాన పంటలు దెబ్బతినకుండా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలన్నారు. పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువలు సిద్ధం చేసుకోవాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు అవసరమైన ఆధారాలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆక్వా రైతులు చెరువుల గట్లు, నీటి పారుదల వ్యవస్థలు, విద్యుత్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖల క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతులు, మత్స్యకారులకు చేరవేయాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదని, మత్స్యకారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. తుపాను ముప్పు పూర్తిగా తొలగే వరకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి రైతులు, మత్స్యకారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
![]()
