టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు మంత్రి కందుల దుర్గేష్

Spread the love

టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు:మంత్రి కందుల దుర్గేష్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీతో ఏపీ టూరిజం నయా ట్రెండ్..టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్‌లో ఏపీ పర్యాటక రంగంపై ప్రశంసలు

మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగానికి విశేష స్పందన..పర్యాటక దిగ్గజాలకు ‘టూరిజం ఇన్నోవేషన్ అవార్డులు’ అందజేసిన మంత్రి కందుల దుర్గేష్

విజయవంతంగా కొనసాగుతున్న మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ పర్యటన..నూతన సాంకేతికతను ఏపీ పర్యాటక రంగంలో అమలు చేయడానికి కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ వెల్లడి

అమరావతి/స్పెయిన్: అంతర్జాతీయ పర్యాటక రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, టెక్నాలజీ వినియోగంపై ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నామని, స్పెయిన్ టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ లో పొందిన అద్భుతమైన అనుభవాలను, ఉత్తమ విధానాలను ఏపీలో పర్యాటక అభివృద్ధికి పూర్తిస్థాయిలో అమలు చేయడానికి విశేష కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.. స్పెయిన్ లోని సెవిల్లె-ఫిబెస్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026’లో భాగంగా మూడో రోజు టూరిస్టెక్ స్టార్టప్ ఫెస్ట్, టూరిజం స్టార్టప్ అట్లాస్, టెక్నలాజికల్ టూర్స్, ట్రావెల్ ఏజెన్సీస్ సమ్మిట్, డిస్కవర్ సెవిల్లె, అర్జెంటీనా డెస్టినేషన్ పార్టనర్ 2026, టూరిజం 4 నేచర్ అవార్డ్స్, అలాగే వెల్‌కమ్ పార్టీ, డిస్కవర్ సెవిల్లె విత్ సిటీ సైట్ సీయింగ్ తదితర కార్యక్రమాలలో మంత్రి దుర్గేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, పర్యాటక రంగ దిగ్గజాలతో మంత్రి దుర్గేష్ ముఖాముఖి చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాల విశిష్టతలను వారికి వివరించడంతో పాటు, ఏపీ పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రత్యేక సావనీర్ బుక్స్ ను అందజేశారు. ఈ సదస్సు ద్వారా ఏర్పడిన బలమైన నెట్‌వర్క్, పారిశ్రామిక పరిచయాలను రాష్ట్రానికి పెట్టుబడులుగా మలిచేందుకు పూర్తి స్థాయిలో చొరవ తీసుకుంటానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ సదస్సులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమ్మిట్ స్టూడియోలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… ప్రపంచ స్థాయి టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్‌లో భాగస్వామి కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దూరదృష్టిగల నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తున్నామని తెలిపారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతలను పర్యాటక రంగంలోకి విజయవంతంగా తీసుకువచ్చినట్లు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు యాత్రికుల సౌకర్యార్థం పిలిగ్రిమ్ టూరిజం, ఎకో టూరిజంతో పాటు సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతంలో ప్రత్యేక వెల్‌నెస్ సెంటర్లు, అమ్యూస్‌మెంట్ పార్కులు, స్టార్ హోటళ్లు, రిసార్ట్‌లను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఎక్స్‌ప్లరర్ సంస్థతో కుదుర్చుకున్న ఎంఓయూ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పర్యాటకులు ఎలాంటి ఖర్చులేకుండా ఉచితంగా 130కి పైగా భాషల్లో 100 పర్యాటక ప్రాంతాల విశేషాలను తెలుసుకునే సరికొత్త సదుపాయాన్ని ఏపీలో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.చరిత్ర ఏదైనా, భాష ఏదైనా.. ఏపీ పర్యాటక కేంద్రాల విశేషాలను చిటికెలో తెలిపే అత్యాధునిక డిజిటల్ గైడ్ టెక్నాలజీని ఏపీలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా దేశవిదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో పర్యాటకాభివృద్ధిని వేగవంతం చేసి రెండేళ్ల కాలంలోనే సుమారు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను సాధించామని, తద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ ద్వారా పర్యాటక రంగంలో సాంకేతికతను మరింత విస్తృతంగా ఎలా ఉపయోగించవచ్చనే అంశంపై అద్భుతమైన అనుభవం లభించిందని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు పర్యాటక ప్రముఖులకు మంత్రి దుర్గేష్ తన చేతుల మీదుగా ‘టూరిజం ఇన్నోవేషన్ అవార్డులు’ అందించడం విశేషం. ఈ పర్యటనలో మంత్రి దుర్గేష్ తో పాటు ఏపీటీఏ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు..

Loading