వైద్య విద్యార్థుల‌కు మెంటార్లు అండ‌గా నిల‌బ‌డాలిప్ర‌తి ఆరేడుగురు విద్యార్థుల‌కు ఒక మెంటార్ ఉండాల్సిందేక‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ల‌కు డాక్ట‌ర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాల‌యం స్ప‌ష్టీక‌ర‌ణ‌36 వైద్య క‌ళాశాల‌ల్లో ‘ఈజ్‌-ఏపీ’ ద్వారా విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు వెల్ల‌డిసాయం కోరేలా పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు ప్రోత్స‌హించాలి-మాన‌సిక వైద్య నిపుణురాలు అప‌ర్ణ వుప్పల‌

Spread the love

వైద్య విద్యార్థుల‌కు మెంటార్లు అండ‌గా నిల‌బ‌డాలి
ప్ర‌తి ఆరేడుగురు విద్యార్థుల‌కు ఒక మెంటార్ ఉండాల్సిందే
క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ల‌కు డాక్ట‌ర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాల‌యం స్ప‌ష్టీక‌ర‌ణ‌
36 వైద్య క‌ళాశాల‌ల్లో ‘ఈజ్‌-ఏపీ’ ద్వారా విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు వెల్ల‌డి
సాయం కోరేలా పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు ప్రోత్స‌హించాలి-మాన‌సిక వైద్య నిపుణురాలు అప‌ర్ణ వుప్పల‌

ఎంబిబియ‌స్ వైద్య విద్యార్థుల మాన‌సిక ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం క‌ళాశాల‌ల్లో మెంటార్‌-మెంటీ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని డాక్ట‌ర్‌ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన‌ విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సుధీర్ కోరారు. వైద్య విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల నేప‌థ్యంలో తీసుకోవాల్సిన మ‌రిన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లపై క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ల‌తో సోమ‌వారం వెబినార్‌ను వీరు నిర్వహించారు. ప్రముఖ మాన‌సిక వైద్య నిపురాణులు అప‌ర్ణ వుప్ప‌ల‌(అమెరికా) వైద్య విద్యార్థుల మాన‌సిక ప‌రిస్థితి, క‌ళాశాల‌ల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు వెబినార్ ద్వారా ప్రిన్సిపాళ్ల‌కు వివ‌రించారు. వెబినార్ ముగిసిన అనంత‌రం వీరు ముగ్గురు విశ్వ‌విద్యాల‌యంలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. వైద్య క‌ళాశాల‌ల్లో ఉండే బోధ‌కుల సంఖ్య‌కు త‌గ్గ‌ట్టు ఒక్కొక్క‌రు ఆరు నుంచి ఏడుగురు విద్యార్థుల‌కు మెంటార్‌-మెంటీగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఈ వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంటే స‌త్ఫ‌లితాలు బాగా ఉంటాయ‌ని చెప్పారు. కొత్త‌గా చేరే ప్ర‌తి ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ఎంబిబియ‌స్ విద్యార్థుల సంక్షేమం నిమిత్తం ప్రిన్సిపాళ్ల నేతృత్వంలో క‌మిటీ ( మెంట‌ల్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్‌)ని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆదేశించింద‌ని గుర్తు చేశారు.’ వైద్య విద్య‌లోని ఒత్తిడి, అందుబాటులో ఉన్న స‌హాయ‌క చ‌ర్య‌లు శారీర‌క‌, మాన‌సికి ఆరోగ్యంపై అవ‌గాహ‌న క‌లిగించాలి. ప్ర‌తి ఏడాది ఒక‌సారి త‌ల్లిండ్రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేయాలి. విద్యార్థుల్లో క‌నిపించే మాన‌సిక స‌మ‌స్య‌ల హెచ్చ‌రిక సంకేతాల‌పై అవ‌గాహ‌న క‌లిగించాలి. ఒంట‌రిగా ఉండ‌డం, గైర్హాజ‌రు పెర‌గ‌డం, చ‌దువులో అక‌స్మాత్తుగా వెనుక‌బ‌డ‌డం, దురాల‌వాట్లు, ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అవ‌డం వంటి హెచ్చ‌రిక సంకేతాలు గ‌మ‌నించిన వెంట‌నే స‌ద‌రు విద్యార్థుల విష‌యంలో మెంటార్ గా ఉన్న‌వారు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి’ అని సూచించారు.

2023లో ప్రారంభమైన ‘ఈజ్‌-ఏపీ’

‘2023 జనవరి 6న ‘ఈజ్‌-ఏపీ’ ( EASE – Emotional Assessment of Students by Educators ) కార్యక్రమం ప్రారంభమైంది. క్యూపీఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా, సూసైడ్‌ ప్రివెన్షన్‌ ఇండియా ఫౌండేషన్‌ సహకారంతో కార్యక్రమం అమలవుతోంది. ఆరోగ్యశాఖ, డాక్ట‌ర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వైద్య విద్యాశాఖ తదితర విభాగాలు భాగస్వాములుగా ఉన్నాయి. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, అవసరమైనప్పుడు సహాయం కోరేలా ప్రోత్సహించడం, తోటి విద్యార్థులకు అండగా నిలిచే నైపుణ్యాలను పెంచడం, మానసిక సమస్యలపై ఉన్న అపోహలు, సంకోచాన్ని తగ్గించడం దీని లక్ష్యాలు. 2025 ఎంబీబీఎస్‌ బ్యాచ్‌కు 17 ప్రభుత్వ, 19 ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో శిక్షణ ఇచ్చారు. 19 ప్రైవేట్‌ కళాశాలల్లో 3,645 మంది విద్యార్థులు నమోదు కాగా, 3,633 మంది పీర్‌ మెంటార్‌ శిక్షణకు హాజరయ్యారు. 99 శాతం హాజరు నమోదైంది. క్యూపీఆర్‌ శిక్షణకు 3,645 మంది నమోదు కాగా, 3,059 మంది శిక్ష‌ణ పూర్తిచేశారు.
4 నుంచి 6 గంటల శిక్షణలో ఒత్తిడి, మానసిక ఇబ్బందుల సంకేతాలను గుర్తించడం, సమయ నిర్వహణ, శ్రద్ధగా వినడం, సానుభూతితో స్పందించడం, అవసరమైనప్పుడు నిపుణుల వద్దకు పంపించడం వంటి అంశాలను నేర్పిస్తున్నారు. క్యూపీఆర్‌ అంటే ‘అడగండి.. ప్రోత్సహించండి.. నిపుణుల వద్దకు పంపండి’. 60–90 నిమిషాల ఆన్‌లైన్‌ శిక్షణ పూర్తిచేసిన వారికి క్యూపీఆర్‌ గేట్‌కీపర్‌ ధ్రువీకరణ పత్రం అందిస్తారు’ వీసీ, రిజిస్ట్రార్ వివ‌రించారు

సాయాన్ని కోర‌డం బ‌ల‌హీత‌న కాదు-అప‌ర్ణ వుప్ప‌ల‌

ఈజ్‌-ఏపీ మెడికల్‌ డైరెక్టర్‌, బాలల–కౌమార మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్‌ అపర్ణ వుప్పల మాట్లాడుతూ విద్యార్థుల్లో ఒత్తిడి, భావోద్వేగ ఇబ్బందులను ముందుగానే గుర్తించాలని సూచించారు. తోటి విద్యార్థిలో ఇబ్బందుల సంకేతాలు కనిపిస్తే విమర్శించకుండా మాట్లాడాలని, అతను చెప్పేది శ్రద్ధగా వినాలని తెలిపారు.అవసరమైనప్పుడు నిపుణుల సహాయం అందేలా చూడాలని సూచించారు. మానసిక సమస్యకు సహాయం కోరడం బలహీనత కాదని, విద్యార్థులు మానసిక వైద్యులను సంప్రదించేందుకు సంకోచించకూడదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు సహాయం కోరేలా ప్రోత్సహించాలని సూచించారు.

ఆత్మహత్య వార్తల క‌వ‌రేజ్‌లో సంయమనం అవసరం

ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలను ప్రచురించేటప్పుడు మీడియా బాధ్యతగా వ్యవహరించాలని ఈజ్‌-ఏపీ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఆత్మహత్య పద్ధతి, ఘటన జరిగిన ప్రదేశం, వ్యక్తిగత లేఖలు, సందేశాలు, చాట్ లు, సామాజిక మాధ్యమాల పోస్టులను ప్రచురించకూడదు. సంచలనాత్మక శీర్షికలను నివారించాలని మానసిక వైద్య నిపుణురాలు అపర్ణ పేర్కొన్నారు.
పరీక్షలు, ర్యాగింగ్‌, కుటుంబ సమస్యలు వంటి ఏ ఒక్క అంశాన్నీ ఆత్మహత్యకు ఏకైక కారణంగా పేర్కొనకూడదని తెలిపారు
విలేకరుల సమావేశంలో రీసెర్చ్ విభాగం డైరెక్టర్ సూర్యప్రభ పాల్గొన్నారు. వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు వెబినార్ లో ప‌లువురు పీజీ వైద్య విద్యార్థుల‌కు కూడా మాన‌సిక ఒత్తిళ్లు అధిగ‌మించ‌డంపై ప్ర‌త్యేకంగా త‌ర‌గ‌తుల్ని నిర్వ‌హించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీనిపై సానుకూల‌త వ్య‌క్త‌మైంది. ఇప్ప‌టికే ఎన్ఎంసి జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వెబినార్ లో విశ్వ‌విద్యాల‌యం స్ప‌ష్ట‌త‌నిచ్చింది. మానసిక ఆరోగ్య పై పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఉందని కూడా vc చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Loading