పార్టీ కాదు.. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం

Spread the love

పార్టీ కాదు.. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం

  • తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదు
  • ప్రతి ఇంటికీ సురక్షిత నీరు.. ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమరజీవి జలధార లక్ష్యం
  • రూ.30,156 కోట్లతో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం
  • ⁠పులివెందులకు రూ.280 కోట్లుతో 299 గ్రామాల తాగు నీటి సమస్యకు పరిష్కారం
  • 3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించేలా భారీ ప్రణాళిక
  • గత ఏడు దశాబ్దాల్లో నిర్మించిన వసతులకు మించి ఈ ఐదేళ్లలోనే భారీ నీటి మౌలిక వసతులు
  • రాయలసీమ నుంచి ఉద్దానం వరకు ప్రతి ప్రాంతానికీ సురక్షిత తాగునీరు
  • ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధి విషయంలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే ‘అమరజీవి జలధార’ లక్ష్యమని తెలిపారు. సోమవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తో కలిసి రూ.30,156 కోట్ల విలువైన తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన నేల. మహాత్మా గాంధీ నడయాడిన నేల. తెలుగు సాహిత్య్యాన్ని తన అక్షరాలతో సుసంపన్నం చేసిన సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులకు జన్మనిచ్చిన నేల ప్రొద్దుటూరు. బంగారం, వస్త్ర వ్యాపారంలో మినీ ముంబై గా, దసరా ఉత్సవాల్లో రెండో మైసూరు గా ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
రూ.30,156 కోట్లతో భారీ తాగు నీటి ప్రణాళిక
రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.30,156 కోట్లతో 50,315 పనులను శ్రీకారం చుడుతున్నాం. 24,601 ఆవాసాల్లో ఇప్పటికే ఉన్న 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచి స్థిరీకరించడంతో పాటు, మరో 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లను అందిస్తున్నాం. మొత్తంగా 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘హర్ ఘర్ జల్’ జల్ జీవన్ మిషన్‌కు గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. 2019-24 మధ్య కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ.26 వేల కోట్లు అందించినప్పటికీ, గత ఐదేళ్లలో రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, అక్కడక్కడ పైపులైన్లు, చిన్నచిన్న పనులు చేసి వదిలేశారు. 2024తో పథకం గడువు ముగుస్తుందని, నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని, ప్రజల తాగునీటి కష్టాలు ఎప్పటికీ తీరవని తెలిసినా కూడా పట్టించుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, జల్ జీవన్ మిషన్‌ను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నేను – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిసి విజ్ఞప్తి చేశాము. అలాగే, కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సి.ఆర్. పాటిల్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ సహకారంతో జలజీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకు పొడిగించుకుని, వెంటనే పనులు ప్రారంభించాం. ఇప్పటికే రూ.4,500 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాము.
గత మౌలిక వసతులకు భారీగా అదనపు సామర్థ్యం
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు రాష్ట్రంలో తాగు నీటి మౌలిక వసతుల అభివృద్ధి క్రమంగా జరిగింది. ఈ కాలంలో 816 ఎం.ఎల్.డి సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, 1,072 ఓవర్ హెడ్ బ్యాలెన్స్ జలాశయాలు, 28,086 ఓవర్ హెడ్ నిల్వ జలాశయాలు, 1.18 లక్షల కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే, ‘అమరజీవి జలధార’ కార్యక్రమం ద్వారా కేవలం ఐదేళ్లలోనే ఈ మౌలిక వసతులకు భారీగా అదనపు సామర్థ్యాన్ని జోడిస్తున్నాం. ఇందులో భాగంగా 1,426 ఎం.ఎల్.డి సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రాలు, 494 ఓవర్ హెడ్ బ్యాలెన్స్ జలాశయాలు, 13,075 ఓవర్ హెడ్ నిల్వ జలాశయాలు, 77 వేల కిలోమీటర్ల పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నాం. అంటే, గత ఏడు దశాబ్దాల్లో నిర్మించిన మౌలిక వసతులతో పోలిస్తే, కేవలం ఈ ఐదేళ్లలోనే 50 శాతం నుంచి 175 శాతం వరకు అదనపు సామర్థ్యాన్ని సృష్టిస్తున్నాం. రూ.9 వేల కోట్లతో 50,283 సింగిల్ విలేజ్ స్కీమ్స్, రెట్రోఫిట్టింగ్ పనులు, రూ.19,500 కోట్లతో 32 మల్టీ విలేజ్ స్కీమ్స్ చేపడుతున్నాం. నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం రూ.1,624 కోట్లు కేటాయించాము.
ఉద్దానం నుంచి డోన్ వరకు, కర్నూలు నుంచి కుప్పం వరకు, గండికోట, పీఏబీఆర్, ఏలేరు, తాండవ, హిరమండలం, ధవళేశ్వరం తదితర జలాశయాల ఆధారంగా తాగు నీటి పథకాలను చేపడుతున్నాం. ఉద్దానం, ఏ.కొండూరు వంటి కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు, రాయలసీమలోని కరువు ప్రభావిత ప్రాంతాలు, పులివెందుల, పుంగనూరు, పలమనేరు, గోదావరి ప్రాంతాల్లోని కాలుష్య ప్రభావిత ప్రాంతాలు, మార్కాపురం వంటి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోనూ సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి
నీటి వనరులకు కొరత లేని ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా తాగు నీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని రూ.6 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆక్వా సాగు, పారిశ్రామిక కాలుష్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ, ఉపరితల నీటి వనరులు కలుషితమవుతున్నాయి. అందుకే నీటి నమూనాలను ఎప్పటికప్పుడు సేకరించి పరీక్షిస్తున్నాం. కాలుష్యానికి కారణమవుతున్న ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాం. అదే సమయంలో, తాగునీటి పథకాల్లో నీటి శుద్ధికి కీలకమైన ఫిల్టర్ బెడ్స్ నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటి వరకు రూ.35 కోట్లతో 340 ఫిల్టర్ బెడ్స్‌ను పునరుద్ధరించాం. మరో 552 ఫిల్టర్ బెడ్స్‌ను రూ.88 కోట్లతో పునరుద్ధరిస్తున్నాం. పంప్ హౌస్‌లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ల నిర్వహణతో పాటు నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం, ఇతర అవసరమైన సహాయక కార్యకలాపాల కోసం రూ.1,600 కోట్లు కేటాయించాం. నీటి శుద్ధి కేంద్రాలు, పంప్ హౌస్‌లలోని ఓపెనింగ్స్‌కు రక్షణ వలలు ఏర్పాటు చేసి బల్లులు, పురుగులు వంటి జీవులు లోపలికి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం.
తాళ్లమాపురానికి రూ.3.5 కోట్ల అభివృద్ధి పనులు
ప్రొద్దుటూరు నియోజక వర్గంలోని తాళ్లమాపురం పంచాయతీ ప్రజలు గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యల పరిష్కారం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 6 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో రోడ్లు, తాగు నీరు వంటి కనీస మౌలిక వసతుల కోసం ప్రజలు పలుమార్లు వినతులు సమర్పించినా, తగిన స్పందన లభించలేదనే ఆవేదన ఉంది. సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువత కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇకపై ఇలాంటి పరిస్థితులకు తావులేకుండా తాళ్లమాపురం, సాగిలి గొడ్డుపల్లి, ములవారిపల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు రూ.1.5 కోట్లతో రెండు కిలోమీటర్ల సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడంతో పాటు, మరో రూ.2 కోట్లతో 90 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్‌హెడ్ రిజర్వాయర్, నాలుగు కిలోమీటర్ల పైప్‌లైన్లు, ప్రత్యేక బోర్‌వెల్ ఏర్పాటు చేయనున్నాం. మొత్తం రూ.3.5 కోట్ల విలువైన ఈ పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నాను. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో కూటమి ప్రభుత్వం ప్రాంతం, పార్టీ అనే తేడా చూడదు. ప్రతి గ్రామానికి సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలన్నదే మా లక్ష్యం. అందుకు నిదర్శనంగా పులివెందులలో అసంపూర్తిగా ఉన్న తాగునీటి పథకానికి రూ.280 కోట్లు కేటాయించి, ఏడు మండలాల్లోని 299 గ్రామాల తాగు నీటి సమస్యకు పరిష్కారం చూపించే చర్యలు చేపట్టాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లోనూ ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేకుండా దాదాపు రూ.2,500 కోట్లతో ‘పల్లె పండుగ’, ‘అడవితల్లి బాట’ వంటి అభివృద్ధి పనులను చేపడుతున్నాం.
కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపు
గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ, జల జీవన్ మిషన్ వంటి కార్యక్రమాల కింద పనులు చేపట్టిన చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎఫ్.ఐ.ఎఫ్.ఓ. విధానంలో బిల్లులను సకాలంలో చెల్లిస్తూ, కాంట్రాక్టర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం. అదే విధంగా 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా పంచాయతీలకు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.4,200 కోట్లను విడుదల చేశాం. పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చూడటం, అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగించడం, పనులు చేసిన వారికి సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం” అన్నారు.
అంతకు ముందు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ర్యాంప్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కలిసి నడుస్తూ సభకు తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, జౌళి శాఖ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్థనరెడ్డి , ప్రొద్దుటూరు శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజులు రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ.ఎన్.సి. శ్రీమతి గాయత్రి దేవి కూటమి పార్టీలకు చెందిన శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.

Loading