రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ యార్డులు పని చేయాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పర్యటించిన ఎమ్మెల్యే…
యార్డు ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు… వినియోగంలో లేని గోడౌన్లు గుర్తింపు
నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని సూచన
గుడివాడ జూన్ 27: రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ యార్డులు పనిచేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అదేవిధంగా ఆదాయం సమకూరే మార్గాలపై కూడా దృష్టిపెట్టాలని అధికారులకు ఆయన సూచించారు.
గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మరియు మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి యార్డు ప్రాంగణ మంతా కలియ తిరుగుతూ పరిశీలించారు.
యార్డు ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు, నిరుపయోగంగా గోడౌన్లు, షెడ్లు ఉండడాన్ని గుర్తించారు. అనంతరం భూసార పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి…. అక్కడ ఉన్న ఆధునిక యంత్ర సామాగ్రి పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…. సీఎం చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతుల ప్రయోజనాలు, వారి అభ్యున్నతి లక్ష్యంగా నియోజకవర్గంలో ఉన్న రెండు మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
యార్డు ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. సమీపంలోనీ టిడ్కో మరియు ఎన్టీఆర్ కాలనీలో వేలాదిమంది ప్రజలు నివసిస్తున్న దృష్ట్యా రైతు బజార్ ఏర్పాటు చేస్తే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న గోడౌన్లు, మరియు షెడ్లు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే కార్యక్రమాలకు అందించే అవకాశాలపై దృష్టి పెడతామన్నారు. ఈ విధానాల ద్వారా ప్రజలకు మేలు జరగడంతో పాటుగా, యార్డ్ కు ఆదాయం చేకూరి రైతులకు మరింత ప్రోత్సాహకాలు అందించే వేసులుబాటు కలుగుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చాట్రగడ్డ రవి, డైరెక్టర్ ఎండి రషీద్ బేగ్, కార్యదర్శి B. సౌజన్య, ADM నిత్యానందం, వ్యవసాయ శాఖ ఏడిఏ రమాదేవి, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, కడియాల గణేష్, మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.