ఎన్‌టీఆర్ జిల్లా (కంచికచర్ల)/జులై 28, 2025
కృత్రిమ కొరత సృష్టిస్తే ఖబడ్దార్..
- రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదు
- దుకాణాల లైసెన్సుల రద్దుకూ వెనుకాడం
- జిల్లాలో సమృద్ధిగా ఎరువులు, పురుగుమందులు
- అందుబాటులో 30,332 మెట్రిక్ టన్నుల ఎరువులు
- నానో యూరియాను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం
- ప్రకృతి సేద్యం దిశగా అన్నదాతలను మళ్లిస్తున్నాం
- పెట్టుబడిని తగ్గించి ఆదాయ వృద్ధికి కృషిచేస్తున్నాం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నవేళ సమృద్ధిగా ఎరువులు, పురుగు మందులు ఉన్నాయని.. ప్రస్తుతం 9,976 మెట్రిక్ టన్నుల యూరియా, 2,457 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,157 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 14,197 మెట్రిక్ టన్నుల ఎన్‌పీకే ఇలా మొత్తం దాదాపు 30,332 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఎరువులు, పురుగుమందులకు సంబంధించి కృత్రిమ కొరత సృష్టించి, అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని, దుకాణాల లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు.
సోమవారం కలెక్టర్ లక్ష్మీశ కంచికచర్లలో శ్రీ కనకదుర్గ ఎరువులు, పురుగుమందుల దుకాణం, గోదాముతో పాటు మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌తో పాటు ఫిజికల్ స్టాటస్‌ను ఆన్‌లైన్ రికార్డులతో సరిపోల్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల సరఫరాపై అప్రమత్తంగా ఉన్నామని, క్షేత్రస్థాయిలో ఆర్‌డీవోలు, తహసీల్దార్లు తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. కృత్రిమ కొరతను సృష్టించడం, ఎరువులను అధిక ధరలకు అమ్మడం, అడిగిన ఎరువును కాకుండా వేరే ఎరువును ఇవ్వడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని, ఒకవేళ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఎరువులు, పురుగు మందులపై ఫిర్యాదులు లేదా సమాచారం అందించేందుకు కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
విచ్చలవిడి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం:
రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రకృతి సాగు విధానాలు దిశగా వారిని మళ్లిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్‌బీఎన్ఎఫ్) వల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు అధిక రాబడులు, ఆదాయాలు వస్తాయన్నారు. ఇష్టమొచ్చినట్లు రసాయన ఎరువులు ఉపయోగిస్తే భూ సారం క్షీణిస్తుందని, పర్యావరణానికీ ముప్పు ఏర్పడుతుందని ఈ నేపథ్యంలో రసాయన ఎరువుల వినియోగాన్ని 15-20 శాతం వరకు తగ్గించేందుకు, పీఎం ప్రణమ్ పథక లక్ష్యాలను చేరుకునేందుకు సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు. నానో యూరియా వల్ల ఎరువు సామర్థ్యంతో పాటు సగానికి సగం ఆదా జరుగుతుందని, అందుకే ఈ నానో యూరియా వినియోగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అగ్రీ టెక్‌ను, అధికా ఆదాయాలు వచ్చే ఉద్యాన పంటలను కూడా ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు.
కలెక్టర్ వెంట నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, అగ్రి ఏడీ శ్రీనివాస్, ఏవో విజయ్ కుమార్, తహసీల్దార్ నరసింహారావు తదితరులు ఉన్నారు.