విజయవాడ, జులై 04, 2025
ఐటీఐ విద్యార్థులకు నైపుణ్యంగల శిక్షణ అందించండి
- భవిష్యత్తులో ఐటీఐ విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు
- ఐటీఐ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
- త్వరలో జిల్లాలో మరో ఐటీఐ ఏర్పాటుకు చర్యలు
- ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన జిల్లాల్లో ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని.. ఐటీఐ ఉద్యోగులు, సిబ్బంది సమర్థవంతమైన సేవలందించడం ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఐ మరియు డి ఎల్ టి సి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం నగరంలోని గురునానక్ కాలనీలో గల శుభలగ్న వేదిక ఫంక్షన్ హాల్ లో సంఘ అధ్యక్షులు పుట్టగుంట రమేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 84 ఐటీఐ, డీఎల్‌టీసీలలో వేలాది మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారన్నారు. 700 మందికిపైగా అధ్యాపకులు, సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పొందిన ప్రతి విద్యార్థి ఉద్యోగావకాశం పొందేలా నైపుణ్యంగల శిక్షణను అందించాల్సిన అవసరముందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను ప్రోత్సహించనున్న నేపథ్యంలో ఉద్యోగావకాశాలు మెండుగా లభించే అవకాశముందన్నారు. విద్యార్థులకు సాంకేతిక, పారిశ్రామిక శిక్షణ అందించడంలో కళాశాలల మధ్య పోటీతత్వం పెరగాలని.. అప్పుడే నైపుణ్యవంతులైన విద్యార్థులను జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అందించగలుగుతామన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య స్నేహపూర్వకమయిన వాతావరణం నెలకొందని..ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి అన్ని విధాలా న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని.. దశల వారీగా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. ఐటీఐ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానన్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తిరువూరులో ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎంపీ శివనాథ్ తెలిపారు.
ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యారంగంలో ఐటీఐలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని.. వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక, పారిశ్రామిక శిక్షణను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయడం జరిగిందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్‌జీవో అసోసియేషన్ అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నూతన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం జరిగిందని.. ఉద్యోగుల మనోభావాలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టేలా తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరేది డిమాండ్లు పరిష్కరించమని కాదని.. ప్రభుత్వం వద్ద దాచుకున్న ఉద్యోగుల సొమ్మును చెల్లించమని మాత్రమే అడుగుతున్నామన్నారు. అదేవిధంగా కరవు భత్యం అనేది ధరల స్థిరీకరణబట్టి ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుందని.. సకాలంలో ప్రభుత్వం డీఏ చెల్లించాల్సి ఉంటుందని.. ఇప్పటికి నాలుగు విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని కనీసం రెండు డీఏలు అయినా ప్రభుత్వం ప్రకటించి ఉద్యోగులను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. త్వరలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారని.. ఆ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లతో పాటు ఐటీఐ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు, కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి 58 నుంచి 62 ఏళ్లకు పెంచడం, జోన్ 1, జోన్ 2లో కొత్త ఐటీఐ కళాశాలలు నెలకొల్పాలని, ఉద్యోగుల మెడికల్ పెండింగ్ బిల్స్ చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఏటీవో పోస్టులను భర్తీ చేయాలని, ప్రాక్టికల్ మెటీరియల్‌కు బడ్జెట్ కేటాయించాలని, ఐటీఐ సూపరింటెండెంట్, ఎంప్లాయ్‌మెంట్ జేఈవో పోస్టుల్లో నెలకొన్న అసమానతలను తొలగించాలన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు.
అనంతరం ఇటీవల జేఏసీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఎ.విద్యాసాగర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికైన డీవీ రమణలను .. పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ జాయింట్ డైరెక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఏపీ గవర్నమెంట్ ఐటీఐ, డీఎల్‌టీసీ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకట రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి కె.రత్నరాజు, కోశాధికారి కేఎస్ శ్రీనివాసరావు, ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు డీఎస్ఎన్ రెడ్డి, వీవీ ప్రసాద్, పి.రమేష్, సిటీ అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్, రాష్ట్రంలోని వివిధ ఐటీఐ కళాశాలలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.