ఈనెల 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 28న సభలో బడ్జెట్ పెట్టే అవకాశం

0

 ఈనెల 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 28న సభలో బడ్జెట్ పెట్టే అవకాశం

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సెలవులతో కలుపుకుని 20 రోజుల పాటు సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 28న శుక్రవారం 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను సభలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు తమ శాఖల్లో అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

 ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులు

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ (అవగాహన) తరగతులు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్ షాప్ జరుగనుంది. కొత్తగా వచ్చిన వారికి సభా నియమాలు, సభలో సభ్యుల పనితీరు, వ్యవహార శైలి, సభా మర్యాదలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొదటి రోజు ఎమ్మెల్యేల అవగాహనా తరగతుల కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే అమరావతికి ఓం బిర్లా వస్తారా.. లేదా వర్చువల్‌గా పాల్గొంటారా అనే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యే అవకాశం ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version