విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయడంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల సహకారం అవసరం: ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ(గాంధీ నగర్ )విజయవాడ ఉత్సవ్‌ను ప్రజలందరి ఉత్సవంగా నిర్వహించేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వాణిజ్య సంఘాల ప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు సంబంధించి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో గాంధీ నగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవ్ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల సహకారంపై ప్రతినిధులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. “విజయవాడ ఉత్సవ్ మన అందరి ఉత్సవం. నగర ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ వాణిజ్య సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవంలో భాగస్వాములు కావాలి. ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవ్‌ను మరింత వైభవంగా నిర్వహించాలి” అని అన్నారు.విజయవాడ నగరం పారిశ్రామికంగా, ఆర్థికంగా, వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య రంగాలు కూడా భాగస్వాములు కావాలని అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు పెరిగేలా అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.విజయవాడకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య ప్రాధాన్యతను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా సమష్టిగా కృషి చేయాలని ఎంపీ చిన్ని అన్నారు.విజయవాడ ఉత్సవ్ విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఎంపీ చిన్ని దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమావేశంలో స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గడ్డం బాల వెంకట రవికుమార్, సెక్రటరీ వక్కలగడ్డ శ్రీకాంత్, వి.వి.కె. నరసింహారావు, తమ్మన శ్రీనివాస్, దామోదర్ రావు, బాలకిషన్ లోయ తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
![]()
