గన్నవరం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

Spread the love

గన్నవరం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గత పదేళ్ల పాలకులు గన్నవరం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు: యార్లగడ్డ

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో గన్నవరం అభివృద్ధికి పెద్దపీట వేసింది: ఎమ్మెల్యే

విజయవాడ రూరల్‌ మండలంలో రెండేళ్లలో దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం

పల్లె పండుగ-3.0లో గన్నవరం నియోజకవర్గానికి రూ.12.36 కోట్ల నిధులు: యార్లగడ్డ

ప్రసాదంపాడులో విజయవాడ రూరల్ మండల గ్రామాల్లో చేపటన్నునున్న రూ.3.85 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన

గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే

ఇప్పటివరకు 69,532 మందికి రక్త పరీక్షలు నిర్వహించాం: యార్లగడ్డ

రైతులకు నా సొంత నిధులతో రూ.2 కోట్లకు పైగా నిధులతో మోటార్లు అందించా : ఎమ్మెల్యే

గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం ఎక్కడైనా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: యార్లగడ్డ

గన్నవరం నియోజకవర్గాన్ని గత పదేళ్ల పాలకులు నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గత పాలకులు అభివృద్ధి పనులపై విమర్శలు చేయడం కాకుండా తాము చేసిన పనులు, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న పనులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. విజయవాడ రూరల్‌ మండలం ప్రసాదంపాడులో మంగళవారం పల్లె పండుగ-3.0లో భాగంగా విజయవాడ రూరల్ మండల గ్రామాల్లో రూ.3.85 కోట్లతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్లు, కల్వర్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. పల్లె పండుగ-3.0లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారులు, అంతర్గత రహదారులు, బీటీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గానికి రూ.12.36 కోట్ల నిధులు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామాలకు రహదారి అనుసంధానం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, రహదారులు మెరుగుపడితే వ్యవసాయం, రవాణా, వ్యాపారం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పేర్కొన్నారు. విజయవాడ రూరల్‌ మండలంలో గత రెండేళ్లలో దాదాపు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రామవరప్పాడులో విద్యుత్‌ ఉపకేంద్రానికి రూ.4.50 కోట్లు, విద్యుత్‌ లైన్ల మార్పిడికి రూ.50 లక్షలు, విద్యుత్‌ స్తంభాల మార్పునకు రూ.40 లక్షలు, అధిక భారమున్న ఫీడర్‌ పనులకు రూ.50 లక్షలు, ఏబీ స్విచ్‌ల ఏర్పాటుకు రూ.40 లక్షలు, ట్రాన్స్‌ఫార్మర్లకు రూ.1.50 కోట్లు కేటాయించినట్లు వివరించారు. సీసీ రోడ్లకు రూ.12.36 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.8.55 కోట్లు, ఎనికేపాడు అండర్‌పాస్‌కు రూ.31.40 కోట్లు, బుడమేరు ఎఫ్‌డీఆర్‌ మరమ్మతులకు రూ.75 లక్షలు, శ్రీశక్తి కల్యాణమార్గం రహదారికి రూ.3.54 కోట్లు, బల్లెంవారి వీధి రహదారి విస్తరణకు రూ.34.95 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులు గుంతలమయంగా మారాయని వెంకట్రావు విమర్శించారు. కనీసం గుంతలు పూడ్చే పరిస్థితి కూడా లేకుండా పాలన సాగిందన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రహదారుల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సుమారు రూ.4,500 కోట్ల నిధులు కేటాయించడం, ఒకేరోజు గ్రామసభలు నిర్వహించి పంచాయతీరాజ్‌ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రసాదంపాడు గ్రామంలో ఇప్పటివరకు రూ.5.61 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రూ.3.87 కోట్లతో సీసీ రోడ్లు, కల్వర్టులు, మరో రూ.30.50 లక్షలతో వివిధ పనులు, మహిళల విజ్ఞప్తి మేరకు అంతర్గత రహదారికి రూ.10 లక్షలు, ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.1.24 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. ఇతర గ్రామాలతో పోలిస్తే ప్రసాదంపాడుకు కేటాయింపులు తక్కువేనని, మానికొండ, తరిగొప్పల, మడిచర్ల వంటి ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉండటంతో వాటికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మడిచర్ల ఎస్సీ కాలనీలో 70 ఏళ్లుగా రహదారి సమస్య ఉందని, రామవరప్పాడులోని కొన్ని ప్రాంతాల్లో 40 ఏళ్లుగా రహదారి సౌకర్యం లేదని వెంకట్రావు తెలిపారు. మానికొండ, తరిగొప్పల గ్రామాలకు వెళ్లేందుకు గతంలో అరగంట సమయం పట్టేదని, రహదారి నిర్మాణం తర్వాత ఐదు నిమిషాల్లో చేరుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పనులు చేపట్టాలనుకుంటే ముందుగా తనకు అనుకూలమైన ప్రాంతాలనే ఎంపిక చేసుకునేవాడినని, అయితే అత్యవసరంగా రహదారులు అవసరమైన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నానని స్పష్టం చేశారు. గన్నవరం నుంచి పశ్చిమ బైపాస్‌, విమానాశ్రయానికి అనుసంధానం కల్పించే రహదారి నిర్మాణానికి కొత్త ప్రతిపాదన ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు రూ.30 కోట్లు కేటాయిస్తే గన్నవరం పట్టణ రూపురేఖలు మారుతాయని అన్నారు. రహదారి అనుసంధానం అభివృద్ధికి పునాది వంటిదని, ప్రపంచంలోని అనేక ప్రాంతాలు మెరుగైన రహదారి వ్యవస్థతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.గన్నవరం నియోజకవర్గంలో వివిధ పనులకు కలిపి సుమారు రూ.100 కోట్ల మేర నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం విషయంలో గత పాలకులు తనపై చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే తప్పుబట్టారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆసుపత్రిలో జనరేటర్‌ కూడా లేని పరిస్థితి ఉందన్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచినప్పుడు వైద్య సేవలు అందించేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధికి హెచ్‌సీఎల్‌ సంస్థ నుంచి రూ.27.50 లక్షలు సమకూర్చడంతో పాటు సంస్థ సహకారంతో జనరేటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి ప్రహరీ గోడ నిర్మాణానికి మండల నిధుల నుంచి రూ.35 లక్షలు వెచ్చించామని చెప్పారు. కోల్‌ ఇండియా నుంచి సుమారు రూ.2.30 కోట్ల మేర సీఎస్‌ఆర్‌ నిధులు సమకూరేలా చర్యలు తీసుకున్నామని, వాటితో అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇతర దాతల సహకారంతోనూ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు తీసుకువచ్చామని వివరించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం గతంలో ఎలా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉందనే అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని వెంకట్రావు అన్నారు. గతంలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ప్రస్తుతం ఎన్ని జరుగుతున్నాయి, ఎంతమందికి రక్త పరీక్షలు నిర్వహించారు, ప్రస్తుతం ఆ సంఖ్య ఎంత ఉంది, ఓపీ సంఖ్య ఎంత పెరిగిందనే వివరాలతో చర్చిద్దామని చెప్పారు. గతంలో ప్రసవాలకు అవసరమైన శస్త్రచికిత్స గది, పడకలు కూడా సరిగా లేని పరిస్థితి ఉండేదని విమర్శించారు. ఆసుపత్రి కమిటీ మాజీ సభ్యులు, ప్రస్తుత సభ్యులు కలిసి ఆసుపత్రిని పరిశీలించాలని కోరారు. మీడియా ప్రతినిధులు కూడా ఆసుపత్రికి వెళ్లి సూపరింటెండెంట్‌, వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులు చెప్పే మాటల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి ప్రజలకు తెలియజేయాలని కోరారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెంకట్రావు తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఇప్పటివరకు 69,532 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిని వినియోగించుకుని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం కంటే ముందుగానే పరీక్షలు నిర్వహించి వ్యాధులను గుర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో హెచ్‌సీఎల్‌ సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. యువతకు ఉచిత ఏఐ శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులతో పాటు ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ తదితర విభాగాల్లో చదువుకున్న వారికి కూడా శిక్షణ అందించాలని కోరడంతో అదనపు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రావడానికి అవసరమైన సహకారం అందిస్తున్నామని, స్థానికంగా భూములు అందుబాటులోకి తీసుకురావడంతో సంస్థలు వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు, స్థలాల్లో నివసిస్తున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని వెంకట్రావు తెలిపారు. గన్నవరంలో 500 మందికి, బాపులపాడులో 425 మందికి ఇళ్ల పట్టాలు అందించామని, వాటి విలువ సుమారు రూ.25 కోట్ల మేర ఉంటుందని చెప్పారు. నిడమానూరులో 316 కుటుంబాలకు పట్టాలు అందించే కార్యక్రమం చేపట్టామని, వాటి ఆస్తి విలువ సుమారు రూ.120 కోట్ల మేర ఉంటుందని తెలిపారు. ప్రెస్‌మీట్లు, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడటం కంటే ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రజాప్రతినిధి బాధ్యత అని వెంకట్రావు అన్నారు. గతంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వారు గన్నవరం సమస్యలపై శాసనసభలో ఎన్నిసార్లు మాట్లాడారు, ఎన్ని సమస్యలను ప్రస్తావించారో ప్రజలకు వివరించాలని కోరారు. తాను శాసనసభలో గన్నవరం సమస్యలను ప్రస్తావించి విద్యుత్‌ ఉపకేంద్రాలు, రహదారులు, వైద్యం, రైతుల సమస్యలు తదితర అంశాలకు నిధులు తీసుకువచ్చినట్లు చెప్పారు. మాజీ మంత్రులు కొడాలి నాని , పేర్ని నాని సవాళ్లు విసరడం కాకుండా గన్నవరం నియోజకవర్గానికి గతంలో టాక్ హయంలో ఏమి చేశారో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండేళ్లలో ఏం చేశానో బహిరంగంగా చర్చిద్దామని వెంకట్రావు సవాల్‌ చేశారు. గన్నవరంలో అయినా, గుడివాడలో అయినా, మచిలీపట్నంలో అయినా చర్చకు సిద్ధమన్నారు. వ్యక్తిగత విమర్శలకు బదులు అభివృద్ధి పనులపై మాట్లాడాలని సూచించారు. ఆధారాలు లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రజాప్రతినిధుల పనితీరుపై వ్యాఖ్యలు చేస్తున్న వారు వాస్తవాలను తెలుసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, ఆ బాధ్యతతోనే ఇళ్ల పట్టాలు, రహదారులు, విద్యుత్‌ ఉపకేంద్రాలు, ఆసుపత్రి అభివృద్ధి, రైతులకు మోటార్లు, యువతకు శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నానని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని వెంకట్రావు తెలిపారు. మండల స్థాయి అధికారులతో వాట్సాప్‌ గ్రూప్ ల ద్వారా సమన్వయం చేసుకుని పరిస్థితులను తెలుసుకున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. గ్రామాల్లో సమస్యలు ఏర్పడిన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని వెంకట్రావు అన్నారు. ఆసుపత్రి, రహదారులు, విద్యుత్‌, సాగునీరు, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మీడియా ప్రతినిధులను కోరారు. రాజకీయ నాయకులు చెప్పిన మాటలను మాత్రమే కాకుండా సంబంధిత శాఖల అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రజలను కూడా అడిగి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజల ముందే వాస్తవాలను ఉంచుతానని, గత పాలనలో జరిగిన పనులు, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న పనులపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.

Loading