పల్లె పండుగ 3.0లో గొల్లపూడి అభివృద్ధికి రూ.3.75 కోట్లు. రూ.1.75 కోట్ల పనులకు ఎమ్మెల్యే వసంత శంకుస్థాపన.

Spread the love

పల్లె పండుగ 3.0లో గొల్లపూడి అభివృద్ధికి రూ.3.75 కోట్లు. రూ.1.75 కోట్ల పనులకు ఎమ్మెల్యే వసంత శంకుస్థాపన.

మరో రూ.2 కోట్ల పనులు త్వరలో ప్రారంభం.

అతిత్వరలో గొల్లపూడి తాగునీటి ప్లాంట్ ప్రారంభం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, అక్టోబర్ 8:

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు.

పల్లె పండుగ 3.0లో భాగంగా గొల్లపూడి గ్రామానికి వీబీజీ రాంజీ పథకం కింద రూ.3.75 కోట్ల నిధులు కేటాయించగా, అందులో రూ.1.75 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు గురువారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు.

శ్రీశైలం కాలనీలో అట్కిన్సన్ స్కూల్ రోడ్డు నుంచి సూర్యనారాయణ రెసిడెన్సీ వరకు, ఇతర అంతర్గత రహదారుల నిర్మాణానికి రూ.75 లక్షలు, సాయిపురం కాలనీలో కె. రాము స్థలం నుంచి శ్రీదేవి స్థలం వరకు, ఇతర అంతర్గత రహదారులకు రూ.57 లక్షలు, బృందావనం కాలనీలో అమీజా ఫామ్స్ నుంచి సాయిప్రసాద్ స్థలం వరకు, ఇతర అంతర్గత రహదారుల నిర్మాణానికి రూ.43 లక్షలు కేటాయించారు. మిగిలిన రూ.2 కోట్ల విలువైన పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వెల్లడించారు.

అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా పాలన.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొండపల్లి మున్సిపాలిటీకి ఇటీవల రూ.96 కోట్ల నిధులు కేటాయించామని, డీఎంఎఫ్ కింద కూడా రూ.9.5 కోట్ల నిధులు తీసుకొచ్చామని వివరించారు.

మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులను 100 శాతం సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. స్థానిక నాయకులు కూడా అభివృద్ధి కార్యక్రమాల అమలుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

10 రోజుల్లో తాగునీటి ప్లాంట్ ప్రారంభం

గొల్లపూడిలో గత కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు తెలిపారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న వాటర్ ప్లాంట్‌ను వచ్చే 10 రోజుల్లో ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్లాంట్ అందుబాటులోకి వస్తే గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Loading