సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో ఏపీ పర్యాటక శాఖ జోరు

Spread the love

సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో ఏపీ పర్యాటక శాఖ జోరు

నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ రూ. 1,114.92 కోట్ల పెట్టుబడితో 12 ఎంఓయూలు

సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , ఆయా శాఖల కార్యదర్శుల సమక్షంలో పర్యాటక రంగంలో కీలక ఒప్పందాలు

గత నెల (అక్టోబర్ 2026)లో విశాఖ, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలలో నిర్వహించిన 5 ప్రాంతీయ సదస్సుల్లో రూ. 6,172.38 కోట్ల విలువైన 50 ఎంఓయూలు..తద్వారా 4,164 గదులు, 40,913 మందికి ఉపాధి అవకాశాలు

మొత్తంగా రూ. 7,287 కోట్ల పెట్టుబడులతో కూడిన 62 ఎంవోయూలు..తద్వారా 5,155 గదుల ఏర్పాటు, 46,853 మందికి ఉపాధి అవకాశాలు

సదస్సులో లక్ష పర్యాటక బ్రోచర్ల పంపిణీ..ప్రతినిధుల కోసం 5 ప్రత్యేక ఫ్యామ్ ట్రిప్స్, ఏపీ పెవిలియన్‌లో 4 కియోస్క్‌లు

గురువారం(నవంబర్ 12న) రూ.255 కోట్లతో విశాఖ, తిరుపతి, నెల్లూరులలో ప్రతిష్టాత్మక హోటళ్ల నిర్మాణానికి ఎంఓయూలు..ప్రత్యక్షంగా, పరోక్షంగా 890 మందికి ఉపాధి అవకాశాలు..సంబంధిత యాజమాన్యంతో చర్చలు

రూ.188 కోట్లతో తిరుపతిలోని రేణిగుంట వద్ద గ్రాండ్ తిరుపతి హోటల్స్, రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ స్టార్ హోటల్ తో జీవో ఎక్స్ఛేంజ్… తద్వారా 201 గదులు, 1030 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి

నూతన పర్యాటక పాలసీ 2024-29 పట్ల అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల ఆసక్తి

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగాన్ని ‘గ్రోత్ ఇంజిన్’గా తీర్చిదిద్దుతాం:మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం: ఏపీ టూరిజాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ‘గ్రోత్ ఇంజిన్’గా మారుస్తున్నామని
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యునివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ థీమ్ తో నవంబర్ 12,13 తేదీల్లో జరుగుతోన్న 31వ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కు మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సు వేదిక వద్ద పర్యాటక శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా గురువారం ఐటీ, విద్యా మంత్రి నారా లోకేష్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఆయా శాఖల సెక్రటరీల సమక్షంలో 236 రూమ్స్ తో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 890 మందికి ఉపాధి అవకాశాలు కలిగే రూ.255 కోట్ల విలువైన 2 ఎంఓయూలు మరియు ఒక జీవో మార్పిడి చేసుకున్నారు.. ఎంవోయూలో భాగంగా రూ. 139.92 కోట్లతో నెల్లూరులో డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్(123 గదులు), వైజాగ్ లో రూ. 115 కోట్లతో ది పార్క్ హోటల్స్(98 గదులు), రూ.188 కోట్లతో తిరుపతిలోని రేణిగుంట వద్ద గ్రాండ్ తిరుపతి హోటల్స్, రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ స్టార్ హోటల్(201 గదులు, 1030 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి) ఏర్పాటుకానున్నాయి..

మొత్తంగా నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ రూ. 1,114.92 కోట్ల పెట్టుబడితో 12 ఎంఓయూలు కుదుర్చుకోనుంది. వీటి ద్వారా 991 హోటల్ గదుల నిర్మాణంతో పాటు 5,940 మందికి ఉపాధి లభించనుంది.

గత నెల (అక్టోబర్ 2026)లో విశాఖ, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలలో నిర్వహించిన 5 ప్రాంతీయ సదస్సుల్లో రూ. 6,172.38 కోట్ల విలువైన 50 ఎంఓయూలు జరిగాయి. వీటి ద్వారా 4,164 గదులు, 40,913 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని మంత్రి దుర్గేష్ అన్నారు.ప్రాంతీయ సదస్సులు మరియు ప్రధాన సమ్మిట్ కలిపి మొత్తం 62 ఎంఓయూల ద్వారా రూ. 7,287.30 కోట్ల పెట్టుబడులు, 5,155 గదులు మరియు 46,853 మందికి ఉపాధి లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.

రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ (APTA) విస్తృత ఏర్పాట్లు చేసింది. సదస్సుకు విచ్చేసే దేశ, విదేశీ ప్రతినిధులకు విశాఖ అందాలను పరిచయం చేయడంతో పాటు పర్యాటక ప్రోత్సాహానికి చేపట్టిన చర్యల వివరాలను అధికారులు వెల్లడించారు.

సీఎంతో భేటీ.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో వన్-టు-వన్ సమావేశాలు

అనంతరం మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, సెక్రటరీ ఆమ్రపాలి కాట, ఏపీటీడీసీ ఎండీ పట్టాన్ శెట్టి రవి సుభాష్ తదితరులు తొలుత సీఎం చంద్రబాబునాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయిన అనంతరం వివిధ దేశాల నుండి తరలివచ్చిన పారిశ్రామికవేత్తలతో విడివిడిగా భేటీ అయి తమదైన శైలిలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, కేంద్ర సహకారాన్ని,’నూతన పర్యాటక పాలసీ 2024-29′ వివరాలను, తద్వారా కల్పిస్తున్న రాయితీలను పారిశ్రామికవేత్తలకు సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా పర్యాటక రంగానికి ప్రభుత్వం ‘పారిశ్రామిక హోదా’ కల్పించడంపై పలువురు పారిశ్రామికవేత్తలు ప్రత్యేక ఆసక్తి కనబరచడం విశేషం.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..”గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్ర పర్యాటక రంగానికి రూ. 20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. ఇందులో ఇప్పటికే దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేశాం. ఈ ఏడాది మరిన్ని భారీ పెట్టుబడులను తీసుకువస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో పారిశ్రామికవేత్తలకు రియల్ టైమ్‌లో అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం అత్యంత కీలకమైన ఆదాయ వనరు. పీపీపీ విధానంలో పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగాన్ని ఒక ‘గ్రోత్ ఇంజిన్’గా మారుస్తాం.” అని స్పష్టం చేశారు.

పర్యాటక మార్కెటింగ్ & బ్రాండింగ్

సరికొత్త ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూ సాగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ (APTA) విస్తృత ఏర్పాట్లు చేసింది. సదస్సుకు విచ్చేసిన దేశ, విదేశీ ప్రతినిధులకు విశాఖ అందాలను పరిచయం చేయడంతో పాటు పర్యాటక ప్రోత్సాహానికి చేపట్టిన చర్యల వివరాలను అధికారులు వెల్లడించారు.సదస్సు సందర్భంగా విశాఖ నగరంలోని ప్రధాన కూడళ్లు, వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రతిబింబించేలా భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 10 ప్రధాన పర్యాటక ప్రాంతాలు, సర్క్యూట్‌ల వివరాలతో కూడిన లక్ష (1,00,000) ప్రత్యేక బ్రోచర్లను ముద్రించి డెలిగేట్ కిట్లు, హోటళ్లు, టూరిజం హెల్ప్ డెస్క్‌ల ద్వారా పంపిణీ చేశారు..

ప్రతినిధుల కోసం ప్రత్యేక ఫ్యామ్ ట్రిప్స్

నవంబర్ 11 నుండి 14వ తేదీ వరకు ప్రతినిధులకు విశాఖ, పరిసర ప్రాంతాల పర్యాటక అనుభూతిని అందించేందుకు ఏపీటీఏ 5 ప్రత్యేక సర్క్యూట్‌లను (హెరిటేజ్ సర్క్యూట్, కంబాలకొండ అడ్వెంచర్ టూరిజం, బౌద్ధ సర్క్యూట్, విశాఖపట్నం సిటీ టూర్, పోర్ట్ ప్రొమెనేడ్) నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బస్సులు, టూరిజం హోస్ట్‌లు, ఇన్‌ఛార్జ్ అధికారులు, క్యూఆర్ (QR) ఆధారిత రిజిస్ట్రేషన్ మరియు టూరిజం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

ఏపీ పెవిలియన్‌లో ప్రత్యేక టూరిజం కియోస్క్‌లు

సదస్సు ప్రాంగణంలోని ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో పర్యాటక ప్రచారం కోసం ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఏపీటీఏకు ప్రత్యేకంగా 4 కియోస్క్‌లను కేటాయించింది. వీటి ద్వారా రాష్ట్రంలోని పర్యాటక సర్క్యూట్‌లు, సాంస్కృతిక ఆకర్షణలు, అడ్వెంచర్ టూరిజం మరియు పెట్టుబడి అవకాశాలను ఇన్వెస్టర్లకు వివరించారు..

ముఖ్యమంత్రి పెవిలియన్‌కు సాంస్కృతిక శోభ

గౌరవ ముఖ్యమంత్రి పెవిలియన్‌కు ఆంధ్రప్రదేశ్ ఘనమైన సంస్కృతి, వారసత్వం ఉట్టిపడేలా ఏపీటీఏ సుందరీకరణ పనులు చేపట్టింది. సంప్రదాయ కళాఖండాలు, హస్తకళలు, శిల్పాలు, పెయింటింగ్‌లతో పెవిలియన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.రాష్ట్రంలోని అపారమైన ప్రకృతి వనరులు, తీర ప్రాంతం, ఆధ్యాత్మిక,వారసత్వ సంపదను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపే దిశగా ఈ సదస్సు ఒక కీలక మలుపుగా మారింది..ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పారదర్శక విధానాలు తమను ఎంతో ఆకట్టుకున్నాయని పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో పేర్కొన్నారు.ఈ ఒప్పందాల ద్వారా విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు నగరాల్లో అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా, రాష్ట్ర పర్యాటక రంగానికి సరికొత్త కళ రానుంది..

Loading