మోండెలేజ్ ఇండియా భాగస్వామ్యంతో కోకో మిషన్ ఏర్పాటుకు ప్రతిపాదన

Spread the love

మోండెలేజ్ ఇండియా భాగస్వామ్యంతో కోకో మిషన్ ఏర్పాటుకు ప్రతిపాదన

చాక్లెట్ల ముడి సరుకును స్థానికంగానే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి సూచన

స్థానిక యువతకు నైపుణ్యశిక్షణ ఇస్తున్న మోండెలేజ్ కంపెనీకి సీఎం చంద్రబాబు అభినందనలు

సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రితో భేటీ అయిన మోండెలేజ్ ఇండియా అధ్యక్షుడు సమీర్ జైన్ బృందం

విశాఖపట్టణం, నవంబర్ 12: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, వ్యవసాయ రంగాన్ని పరిశ్రమలతో అనుసంధానించడానికి ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్టణంలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ప్రముఖ గ్లోబల్ స్నాకింగ్ దిగ్గజం మోండెలేజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెండ్ సంస్థ అధ్యక్షుడు సమీర్ జైన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది. శ్రీసిటీలోని మొండెలేజ్ ప్లాంట్ విస్తరణ, రాష్ట్రంలో కోకో సాగు ప్రోత్సాహం, స్థానిక ఉపాధి కల్పనపై చర్చించారు. శ్రీసిటీలో మొండెలేజ్ సంస్థకు చెందిన చాక్లెట్ తయారీ యూనిట్ విస్తరణకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలు… వాటిని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలు వీరి సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. రూ.1,800 కోట్ల పెట్టుబడితో చాక్లెట్ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 90 శాతం పెంచే ప్రక్రియపై పనులు జరుగుతున్నాయని… ఈ విస్తరణ పనులు పూర్తయితే శ్రీసిటీలోని ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ కేంద్రాలలో ఒకటిగా నిలుస్తుందని సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీని కోసం అవసరమైన సహకారాన్ని, మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విరివిగా పండుతున్న కోకో పంటకు ప్రోత్సాహం ఇవ్వటం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

స్థానికులకు సహకరించండి… ప్రొత్సహించండి

మోండెలేజ్ సంస్థ తన ఉత్పత్తులకు కావలసిన ముడిసరుకుల స్థానికంగానే సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. ఉత్పత్తులకు అవసరమైన వాటిని స్థానికంగా సేకరించుకుంటే… ఆ మేరకు ఆయా ప్రాంతాల్లోని రైతులు, డ్వాక్రా మహిళలకు మరింత ఆదాయం లభిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. కోకో, పాడి ఉత్పత్తులు, ప్యాకేజింగ్ మెటీరియల్‌ను రాష్ట్రంలోని తయారీదారుల నుంచే సేకరించాలని, ముఖ్యంగా ప్యాకేజింగ్ పరిశ్రమల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు స్థానికులకు ఎక్కువగా ఇచ్చేలా చూడాలని కోరారు. రాష్ట్రంలోని స్థానిక రైతులు, పొదుపు సంఘాల మహిళలను నేరుగా తమ సప్లై చైన్‌లోకి అనుసంధానించి, పాలు, చక్కెర సహా వివిధ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా సేకరించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా తాము స్థానిక యువతకు ఇస్తున్న స్కిల్ ట్రైనింగ్ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు ఆ సంస్థ ప్రతినిధులు. మోండెలేజ్ సంస్థ చేపడుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను సీఎం అభినందించారు. స్థానిక పారిశ్రామిక అవసరాలకు మానవ వనరుల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.

పీ4లో భాగస్వాములవ్వండి.

రాష్ట్రంలో కోకో సాగును బహుళ ప్రయోజనకరంగా మార్చేందుకు మోండెలేజ్ భాగస్వామ్యంతో కోకో మిషన్ ప్రారంభిస్తామని.. దానికి సహకరించాలని సీఎం ప్రతిపాదించారు. దీని ద్వారా ప్రతి ఏటా 10,000 హెక్టార్లలో కోకో సాగును విస్తరించి, 2040 నాటికి 50,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యమైన కోకో సాగును ప్రోత్సహించడానికి తిరుపతిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో కోకో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ -ఆర్ అండ్ డి హబ్ ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పాలీక్లోనల్ గార్డెన్స్ అభివృద్ధి, నాణ్యమైన విత్తనాలు, పరిశోధనలు పెంపొందించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అలాగే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ భేటీలో మొండెలేజ్ ఇండియా సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ వెనెపల్లి, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Loading