
సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు.. అభివృద్ధికి రూ.1.34 లక్షల కోట్లు
26 నెలల్లో ఇచ్చిన హామీలను అమలు చేశాం : ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ 26 నెలల కాలంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ.1.34 లక్షల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించినట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.40 వేల కోట్లను చెల్లించామన్నారు. శనివారం ఆయన ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా ఏటా 67.47 లక్షల మంది విద్యార్థులకు రూ.20,210 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు 100 కోట్ల ప్రయాణాలు పూర్తయినట్లు యార్లగడ్డ వివరించారు. దీపం పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, ఇప్పటివరకు 4.61 కోట్ల సిలిండర్లను మహిళలకు ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కల్పించేందుకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.12,110 కోట్లు ఇచ్చామన్నారు. రూ.73,507 కోట్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేసినట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా, 5,757 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 7.42 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు యార్లగడ్డ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా మన రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, దేశం మొత్తం వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం మన రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావచ్చిందని, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించామన్నారు. గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టడంతో పాటు అధ్వానంగా మారిన రహదారులను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. వచ్చే నెలలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు మంజూరవుతున్నాయని, ఇదే రీతిగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూటమి పాలన వస్తే అభివృద్ధి, సంక్షేమానికి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. అరాచక పాలనతో అల్లాడిపోయిన గన్నవరం నియోజకవర్గ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పుతో అరాచక పాలన అంతమై సంక్షేమ పాలన సాగుతోందని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో కొత్తగా అర్హులైన 4,800 మందికి రేషన్ కార్డులు ఇప్పించానని, రూ.2 కోట్లు సొంత నిధులు వెచ్చించి రైతుల సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు 100 మోటార్లు కొనుగోలు చేసి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా యార్లగడ్డ గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో 22 ప్రజాదర్బార్లు నిర్వహించి, అందులో వచ్చిన 8,780 అర్జీలను పరిష్కరించినట్లు యార్లగడ్డ వివరించారు. సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు కొత్తగా 16 మార్గాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు భారీ విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు.
![]()
