స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎం అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే ఘన విజయం

Spread the love

వైసీపీకి ఈసారి ఆ 11 సీట్లు రావు

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎం అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే ఘన విజయం
  • అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
  • రాయలసీమ నుంచి అద్భుతమైన పరిశ్రమలను తరిమేసిన ఘనత వైసీపీదే
  • పారిశ్రామికవేత్తలపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు చేసిన చరిత్ర వైసీపీ నాయకులది
  • ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో నిండి ఉండాలి అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకువస్తోంది. వైసీపీ నాయకులను జనం ఛీదరించుకుంటున్నారు. అయినా వారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదే పంథాలో వైసీపీ నాయకులు ముందుకు వెళితే గత ఎన్నికల్లో ఇచ్చిన 11 సీట్లను కూడా ప్రజలు ఈ సారి ఇచ్చే అవకాశం లేద’ని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. గురువారం ఏలూరు జిల్లా సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. “ఏ ప్రాంతంలో రానన్ని పెట్టుబడులు ప్రవాహం ఆంధ్రప్రదేశ్ కు వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు తోడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకం, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకు వెళ్తుంది. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఐటీ, ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగ అభివృద్ధి లో రాష్ట్ర పురోగతి పరుగులు తీస్తోంది. మూడు ఎకనామిక్ జోన్లతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్, క్వాంటం వ్యాలీ వంటి సాంకేతికరంగ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే బృహత్తరమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పవన్ కళ్యాణ్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి. రక్షిత మంచినీరు అందించే పథకాల పనులు వేగవంతం అవుతున్నాయి.
రాయలసీమ నుంచి పరిశ్రమలను తరిమేసిన పాపం వైసీపీదే
2019-24 మధ్య వైసీపీ పాలనా సమయంలో రాయలసీమ నుంచి ఎన్నో అద్భుతమైన పరిశ్రమలను ఆ పార్టీ నాయకులు తరిమేశారు. వైసీపీ నాయకుల బెదిరింపులు, దౌర్జన్యాల దెబ్బకు ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అప్పట్లో వైసీపీ నాయకులు చేయని దాష్టికం లేదు. 2014-19 సంవత్సరాల మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాయలసీమకు వచ్చిన కియా పరిశ్రమ, వైసీపీ హయాంలో తన అనుబంధ సంస్థలను రాయలసీమలో ఏర్పాటు చేయడం కోసం సిద్ధం ఐతే వైసీపీ ఎంపీ ఏకంగా కియా మోటార్స్ యాజమాన్య ప్రతినిధులపై చేసిన బెదిరింపులు ప్రపంచమంతా చూసింది. అప్పట్లో ఆ ఎంపీ చేసిన అరాచకం వల్ల కియా మోటార్స్ తన అనుబంధ విభాగాలను చెన్నై, కర్ణాటక ప్రాంతాలకు తరలించింది. రాష్ట్రానికి చెందిన ఎంపీ అప్పట్లో రూ. 9,500 కోట్లతో అమరరాజా పరిశ్రమలు పెడతాను అంటే అప్పటి వైసీపీ పాలకులు సహకరించలేదు. ఆ పరిశ్రమ తెలంగాణకు వెళ్ళిపోయింది. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ ప్రతినిధులను వైసీపీ నాయకులు బెదిరించడంతో ఆ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోయింది. రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చిన ఏషియా పల్ప్ పేపర్ ఇండస్ట్రీ ని వైసిపి నాయకులు బెదిరించడంతోనే వెనక్కు వెళ్లిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో రేణిగుంటలో పరిశ్రమ పెట్టడానికి ముందుకు వస్తే కనీసం భూమి కూడా కేటాయించలేదు. పరిశ్రమలను ముప్పుతిప్పలు పెట్టిన వైసీపీ నాయకులు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు గురించి మాట్లాడుతుంటే జనం చూసి నవ్వుకుంటున్నారు.
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా రెడీ
కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని అందరికీ అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో పని చేస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ వాళ్ళకి ముందే తెలుసు. అందుకే ఆ పార్టీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈవీఎం అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమి ఘనవిజయం తథ్యం. 2024 ఎన్నికల్లో వైసీపీ కి 11 సీట్లు ఇచ్చిన ప్రజలు అవి కూడా ఎందుకు ఇచ్చాం అనే ఆలోచనతో ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఆ సీట్లు కూడా రావు” అన్నారు.
ఈ సమావేశంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ ఉన్నారు.

Loading