హైందవ శంఖారావానికి రాష్ట్రవ్యాప్త ప్రచారం, 25లక్షల కుటుంబాలను నేరుగా కలవనున్న విహెచ్‌పి

0

 హైందవ శంఖారావానికి రాష్ట్రవ్యాప్త ప్రచారం, 25లక్షల కుటుంబాలను నేరుగా కలవనున్న విహెచ్‌పి

దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విశ్వహిందూ పరిషత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలను నేరుగా కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆ వివరాలను విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వర శర్మ వివరించారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు, గ్రామాలకు విహెచ్‌పి కార్యకర్తలు ప్రత్యక్షంగా వెళ్ళి హైందవ శంఖారావం గురించి ప్రచారం చేస్తారు. అలాగే ఆన్‌లైన్‌లో కోటిమంది సంతకాలతో మద్దతు స్వీకరిస్తారు. జనవరి 5న విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమానికి పూర్వరంగంగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తారు. ప్రతీ దేవాలయంలోనూ సామూహిక హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ విధంగా రాష్ట్రంలో అతిపెద్ద జనజాగరణ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ నాంది పలుకుతోంది.

హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి కోరుతూ విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా మహా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అవసరమైన చట్ట సవరణలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30న దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకూ మెమొరాండం సమర్పించారు. ఆ జాతీయ ఉద్యమంలో భాగంగా హిందూ సమాజం ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు దేశంలో మొదటి కార్యక్రమంగా 2025 జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ‘హైందవ శంఖారావం’ ఏర్పాటు చేసారు.

ఆ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ ధర్మాచార్యులు, సాధుసంతులతో పాటు విశ్వహిందూ పరిషత్ జాతీయ స్థాయి నాయకులు కూడా పాల్గొని మార్గదర్శనం చేస్తారు. హిందూదేవాలయాలకు స్వయంప్రతిపత్తి అవసరం, అనివార్యం అనే విషయాన్ని ప్రభుత్వాలకు అర్ధమయ్యేలా చేయాలి. దానికోసం రాష్ట్రంలోని హిందువులు పెద్దసంఖ్యలో హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొనాలి. దేవాలయాలను ప్రభుత్వీకరణ కాకుండా, హిందూ సామాజికీకరణ చేయడం నేటి అవసరమని విశ్వహిందూ పరిషత్ భావిస్తోందని కోటేశ్వర శర్మ వివరించారు.

దేవాలయాల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఆలయాల సంపదలను హిందువుల శ్రేయస్సుకు మాత్రమే ఉపయోగించాలి. ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేయాలి. దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగించాలి. హిందూ సమాజంతో ఒక ఉత్తమ నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి వాటికి ఆలయాలను అప్పగించాలి. దానికోసం ధర్మాచార్యులు, విశ్రాంత న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, పరిషత్ పెద్దలు కలిసి ఎన్నో దశాబ్దాలుగా పరిశీలించి ముసాయిదాను రూపొందించారు. ఆ ముసాయిదాను ప్రభుత్వాలు పరిశీలించి హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ చట్టసవరణ చేయాలి అని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.

ఈ కార్యక్రమంలో విహెచ్‌పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ, విహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి – హైందవ శంఖారావం కన్వీనర్ తనికెళ్ళ సత్యఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version