సింగయ్య మృతితో కష్టాల్లోకి ఆయన కుటుంబం – మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు – ఇల్లు గడవడం ఎలాగో తోచని అయోమయస్థితిలో సింగయ్య భార్య
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పల్నాడు పర్యటనలో చీలి సింగయ్య ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. కష్టపడి పనిచేసి సంపాదిస్తే కానీ పూట గడవని పరిస్థితి. అలాంటి కుటుంబానికి జగన్ ర్యాలీ రూపంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. అభిమాన నేత వాహనం కిందపడి ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. సింగయ్య మరణాన్ని ఆయన భార్య, పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లల చదువుల మాట అటుంచి ఇకపై ఇల్లు ఎలా గడుస్తుందనే ఆలోచన వారిని కలచివేస్తోంది.
గుంటూరు జిల్లా వెంగళాయపాలేనికి చెందిన చీలి సింగయ్య ఈ నెల 18 న ఏటుకూరు వద్ద మాజీ సీఎం జగన్ వాహనం కిందపడి మరణించారు. వృత్తిరీత్యా ప్లంబర్ అయిన ఆయన రోజువారీ వచ్చే కూలీ సొమ్ముతోనే కుటుంబాన్ని పోషించేవారు. అత్యవసరాల కోసం 2 లక్షల మేర అప్పులు చేశారు. వాటికి వడ్డీలు కడుతూ నెట్టుకొస్తూ వచ్చారు. రోజూ ఉదయాన్నే పనికి వెళ్లే సింగయ్య జగన్ పల్నాడు పర్యటన రోజున గుంటూరు మీదుగా వెళ్తున్న విషయం తెలుసుకొని అభిమానంతో ఆయణ్ని చూసేందుకు వెళ్లారు.
రహదారి పక్కనే ఉన్న సమయంలో జగన్ వాహనం కిందపడి సింగయ్య మృతి చెందారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఆయన కుటుంబం వెంగళాయపాలెంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని జీవిస్తోంది. పదో తరగతి వరకూ చదువుకున్న సింగయ్య కుమారులిద్దరినీ బాగా చదివించాలని ఆకాంక్షించారు. పెద్ద కుమారుడు బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరం చదవుతున్నారు. ఏడాదికి రూ. 40,000లు కళాశాల ఫీజు, నరసరావుపేటకు రాకపోకలకు అయ్యే ఖర్చులు భారమైనా కష్టపడి చదివించేవారు.
చిన్న కుమారుడు ఓ ప్రైవేట్ కళాశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. పిల్లల్ని ప్రయోజకులను చేయాలన్న లక్ష్యంతో సింగయ్య కొంత అప్పు చేసి పిల్లలను చదివిస్తూ వచ్చారు. భర్త మృతితో పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ఆయన భార్య మేరీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతితో వారి కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. గతంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే మేరీ ఇప్పుడు అనారోగ్యం కారణంగా ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో ఉన్నారు. అప్పులు తిరిగి చెల్లించడంతో పాటు చదువులకు ఫీజుల డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక అతడి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. జగన్ ర్యాలీలో జరిగిన ప్రమాదం, వైఎస్సార్సీపీ నేతల నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టింది.