వినాయక ఆలయం కూల్చివేత దారుణం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

0

 21.03.2025

వినాయక ఆలయం కూల్చివేత దారుణం

వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

దేవీనగర్ లో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయాన్ని వీఎంసీ అధికారులు కూల్చివేయటం దారుణమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జీవీఆర్ నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో అధికారులు జేసీబీలతో కూల్చివేసిన ఆలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా అత్యుత్సాహంతో అధికారులు ఆలయాన్ని కూలగొట్టడం క్షమించరాని నేరమన్నారు. అసోసియేషన్ సభ్యులకు కనీస సమాచారం అందించకుండా.. అప్పటికప్పుడు రెండు జేసీబీలతో కూల్చివేయటం ఏమిటని ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా ట్రెండ్ సెట్ లో ఆలయ నిర్మాణం జరుగుతుందని.. అభ్యంతరాలు ఉంటే ప్రాథమిక దశలోనే ఎందుకు నిలుపుదల చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. పైగా గర్భగుడిలోనికి జేసీబీలను పంపించటం.. కూటమి ప్రభుత్వ అహంకారానికి అద్దం పడుతోందన్నారు. ఎవరి ఆదేశాలతో.. వీఎంసీ ఈ దారుణానికి ఒడిగట్టిందో కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దీనిపై కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు.

కూటమి ప్రభుత్వంలో గుడులకు, గోవులకు రక్షణ లేకుండా పోయింది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక మధురానగర్ కాలువగట్టుపై 40 ఏళ్ల నాటి నాగేంద్రస్వామి పుట్టని తొలగించటంతో పాటు దుర్గాదేవి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయం, శ్రీకృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూడా దౌర్జన్యంగా కూల్చివేశారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. అలాగే బద్యేల్ లోని శ్రీ అవధూత కాశీనాయన జ్యోతిక్షేత్రంలో ఏం జరిగిందో చూశామన్నారు. నెల్లూరులోనూ రహదారి విస్తరణ పేరుతో నాగమ్మ ఆలయాన్ని కూల్చివేసి దేవతామూర్తుల విగ్రహాలను పెకలించారని ఆరోపించారు. పల్నాడులో 15 ఏళ్లుగా భక్తులు పూజిస్తున్న త్రికోటేశ్వరస్వామి, కనకదుర్గమ్మ ఆలయాన్ని కూల్చివేశారని.. ఇలా కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని మల్లాది విష్ణు అన్నారు. గతంలోనూ హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేతలు అత్యధికంగా జరిగినది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలోనేనని మల్లాది విష్ణు విమర్శించారు. 2014-19 మధ్యకాలంలో రోడ్డు విస్తరణ ముసుగులో పదుల సంఖ్యలో దేవాలయాలను కూల్చివేయించారని.. దాదాపు 100 కి పైగా తీవ్రమైన ఘటనలు జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. చెత్త తరలించే వాహనాలలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లిన దారుణ సంఘటనలు చోటు చేసుకుంది 2014-19 మధ్యకాలంలో కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. కృష్ణా పుష్కరాల సమయంలోనూ నగరంలో 23 దేవాలయాలను కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుదని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పునర్నిర్మించడం జరిగిందని గుర్తుచేశారు. మరలా కూటమి ప్రభుత్వంలో అటువంటి దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత పూజ్యమైన తిరుమల ఆలయంతో పాటు పలు హిందూ దేవాలయాల పవిత్రతపై రాజీ పడుతూ.. ఈ ప్రభుత్వం భక్తుల కష్టాలను మరింత తీవ్రతరం చేస్తోందని ఆరోపించారు. హిందూ దేవాలయాలపై కూటమి ప్రభుత్వం పగబట్టిందని.. సనాతన ధర్మమంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే బీజేపీ.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కూల్చివేతకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు మార్తి చంద్రమౌళి, సామంతకురి దుర్గారావు, డి.దుర్గారావు, పవన్ రెడ్డి, నగరి ప్రసాద్, ఓంకార్ రెడ్డి, చైతన్య, రమేష్, తదితరులు ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version